దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యి పది రోజులకు చేరువ అవుతోంది. ఇప్పటికే ఎన్నెన్నో సంచలన రికార్డులు ఈ సినిమా క్రియేట్ చేస్తోంది. రు. 710 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసిన త్రిబుల్ ఆర్ త్వరలోనే రు. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిపోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్‌కు చేరువలో ఉంది. ఏపీలో కొన్ని సెంటర్లలో, నార్త్‌లో హిందీ బెల్ట్ మినహా యిస్తే నైజాం, ఓవర్సీస్ లాంటి చోట్ల ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది.
ఇక ఒకప్పుడు సింగిల్ థియేటర్లో ఓ సినిమా కోటి రూపాయలు వసూలు చేయడం అంటే గొప్ప. పైగా ఆ వసూళ్లు కూడా ఏ 100 రోజులకో లేదా 175 రోజులకో వచ్చేవి. మురారి లాంటి సినిమాలు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సింగిల్ థియేటర్లో కోటి రూపాయలు వసూలు చేస్తే గొప్ప అనేవాళ్లు. అయితే ఇప్పుడు ఒక థియేటర్లో ఓ సినిమా కోటి రూపాయలు కొల్లగొట్టడం కేవలం వారం రోజుల్లోనే సాధ్యమైంది. ఆ రికార్డ్ కూడా త్రిబుల్ ఆర్‌కే దక్కింది.
ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలో మాత్రమే ఈ ఫీట్ సాధ్యమయ్యేది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో సింగిల్ థియేటర్లలో కోటి రూపాయల గ్రాస్ సులువుగా వస్తోంది. ఇక హైదరాబాద్‌లో క్రాస్ రోడ్స్‌లో థియేటర్లు, ఏఎంబీ మాల్స్‌లో ఇప్పుడు కోటి రూపాయలు అనేది కేక్ వాక్ అయిపోయింది. తాజాగా త్రిబుల్ ఆర్ క్రాస్ రోడ్స్‌లో మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 35 ఎంఎంలో రూ.2 కోట్ల గ్రాస్‌కు చేరువైంది. ఒక్క ఈ క్రాస్ రోడ్స్ సెంటర్ వరకు చూస్తే రు. 4 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి.. రు. 5 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
ఇక రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిబుల్ ఆర్ ఇప్పుడు క్రాస్ రోడ్స్‌లో నాలుగు థియేటర్లలో రన్ అవుతోంది. కేవలం ఒకే ఒక్క ఏరియాలో రు. 5 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రాజమౌళి సినిమా కావడంతో పాటు అటు ఎన్టీఆర్, చెర్రీ ఉండడం.. టిక్కెట్ రేట్లు ఎక్కువుగా ఉండడంతోనే ఈ ఫీట్ త్రిబుల్ ఆర్‌కు సాధ్యమైంది.