నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో మరపురాని రికార్డులు ఉన్నాయి. ఒక్క సినిమా హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో సంవత్సరం ఆడడం అంటే ఎంత బిగ్గెస్ట్ రికార్డో చెప్పక్కర్లేదు. ఈ రికార్డ్ ఇప్పటకీ చెక్కు చెదరకుండా మంగమ్మగారి మనవడు పేరిటే ఉంది. ఇక సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, తాజాగా అఖండ లాంటి సినిమాలతో ఎన్నో రికార్డులు బాలయ్య పేరిట నమోదు అయ్యాయి. లెజెండ్ 1000 రోజులు ఆడినా, నరసింహానాయుడుతో దేశ చరిత్రలోనే ఓ సినిమా 100 కేంద్రాల్లో ఫస్ట్ టైం 100 రోజులు ఆడినా ఇలా ఎన్నో రికార్డులు బాలయ్యకే సొంతం అయ్యాయి.
1989వ సంవత్సరంలో బాలయ్య నాలుగు సినిమాల్లో నటిస్తే మూడు సినిమాలు ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాయి. 1989లో బాలయ్య – విజయశాంతి జంటగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో భలేదొంగ సినిమా చేశారు. అలాగే బాలయ్య- విజయశాంతి జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ముద్దుల మావయ్య సినిమా ( తమిళ సినిమా రీమేక్) , బాలయ్య – భానుప్రియ కాంబోలో మాలయాళ హిట్ మూవీ ఆర్యన్‌కు రీమేక్‌గా అశోక చక్రవర్తి వచ్చింది. ఇక బాలయ్య – సుహాసిని జంటగా కోడి రామకృష్ణ కాంబోలో బాల గోపాలుడు వచ్చింది.
ఈ నాలుగు సినిమాల్లో బాలగోపాలుడు – ముద్దుల మావయ్య – భలే దొంగ మూడు సినిమాలు కూడా ఫస్ట్ వీక్‌లో కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసిన మూడు చిత్రాలుగా రికార్డు క్రియేట్ చేశాయి. ఒకే యేడాదిలో.. అది కూడా ఒకే హీరో నటించిన మూడు సినిమాలు ఫస్ట్ వీక్‌లో కోటి రూపాయలకు పైగా షేర్ రాబట్టిన ఘనత అప్పటి వరకు ఏ హీరోకు లేదు. భలేదొంగ 1,11,24,464/- , ముద్దుల మావయ్య 1,16,32,692/- , బాలగోపాలుడు 1,36,54,360/- వసూళ్లు రాబట్టాయి.
ఇక ముద్దుల మావయ్య అయితే మొన్న ఉగాదికి 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 51 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 25 రోజులకి రూ.1,56,00,000/-షేర్ తో అప్పటి ఇండస్ట్రీ రికార్డు సృష్టించి. టోటల్ గా రూ.5.5 కోట్లు రూపాయలు వసూలు చేసింది. ఒకే సంస్థలో ఒకే హీరోతో ఒకే దర్శకుడితో ( బాలయ్య – భార్గవ్ ఆర్ట్స్ – కోడి రామకృష్ణ) వరుసగా నాలుగు 300 రోజుల సినిమాలు రూపొందడం ఒక్క బాలయ్యకే చెల్లింది. భారతదేశ సినీ చరిత్రలోనే ఈ రికార్డు మరే హీరోకు లేదు.
ఒడిశాలోని పర్లాకమిడీ, కర్నాకటలోని చింతామణి సెంటర్లలో కూడా ఈ సినిమా 100 రోజులు ఆడడం విశేషం. ఆ రోజుల్లోనే మన తెలుగు గడ్డకు బయట రాష్ట్రాల్లో కూడా 100 రోజులు ఆడడం అంటే పెద్ద సంచలనం. ఇక హైదరాబాద్‌లోనే ఏకంగా 6 థియేటర్లలో 100 రోజులు ఆడింది.