ఇన్నాళ్ల వరకు కన్నడ సినిమా అనేది బావిలో కప్పలా తన లోకంలో ఉండిపోతూ వచ్చింది. అసలు వాళ్ల స్టేట్‌లో నిన్న మొన్నటి వరకు రిలీజ్ కావాలంటే కన్నడ భాషలోకి డబ్బింగ్ చేయకూడదు అన్న నిబంధన ఉండేది. ఇతర భాషల సినిమాలు ఆ ఇండస్ట్రీని ఎక్కడ డామినేట్ చేస్తాయో ? అన్న భయంలో వారిలో ఉండేది. అయితే ఇటీవలే ఆ నిబంధన ఎత్తేశారు. ఇప్పుడిప్పుడే ఇతర భాషల సినిమాలు కూడా కన్నడలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అసలు అప్పుడెప్పుడో రాజ్‌కుమార్ లాంటి వాళ్లను వదిలేస్తే కన్నడ హీరోల గురించి ఇతర భాషల వాళ్లకు తెలిసింది.. ఇతర భాషల వాళ్లు పట్టించుకునేదీ తక్కువే.
మధ్యలో ఉపేంద్ర.. ఇక ఇటీవల చనిపోయిన పునీత్ రాజ్‌కుమార్ లాంటి వాళ్లే కాస్తో కూస్తో తెలుసు. పునీత్ చనిపోయి ఆయన సేవా కార్యక్రమాలతో చాలా మందికి దేవుడు అయ్యాడు. ఇక ఇప్పుడు కేజీయఫ్‌తో రాకీ భాయ్‌గా మోత మోగించేస్తున్నాడు. కాసేపు యశ్‌ను పక్కన పెడితే ఇప్పుడు అందరూ కన్నడ సినిమా రేంజ్‌ను ఢిల్లీ లెవల్‌కు తీసుకు వెళ్లిన ప్రశాంత్ నీల్ గురించే మాట్లాడుకుంటున్నారు. మనకు సహజంగానే మన తెలుగోడు అయిన రాజమౌళిపై ప్రేమ ఉంటుంది.. తప్పులేదు.
కానీ రాజమౌళి ఈ స్థాయికి రావడానికి 22 ఏళ్లు… అది కూడా 12 సినిమాల టైం పట్టింది. అదే ప్రశాంత్ నీల్ కేవలం మూడంటే మూడు సినిమాలతో రాజమౌళికి దరిదాపు స్థాయికి వచ్చేశాడు. పైగా రాజమౌళి సినిమాలు సూపర్ హిట్ అయినా వాటి బడ్జెట్ చాలా ఎక్కువ. ఆయన స్టార్లను నమ్ముకుని బ్లాక్‌బస్టర్లు కొట్టాడు. కేజీయఫ్ వచ్చే వరకు యశ్ అంటే చాలా మందికి తెలియదు. త్రిబుల్ ఆర్ రు. 1000 కోట్లు కొల్లగొట్టినా ఇద్దరు హీరోల అపరిమితమైన క్రేజ్‌ను తక్కువ చేసి చూపలేం.
అయితే యశ్ ఇంతకు ముందు ఓ మామూలు హీరో. యశ్‌ను ఖచ్చితంగా పాన్ ఇండియా హీరోను చేసి.. కన్నడ సినిమా రేంజ్ ఇది రా అని సవాల్ చేసి ఇండియన్ సినిమాకు చూపించిన ఘనత ఖచ్చితంగా ప్రశాంత్ నీల్‌దే. కర్నాకటలోని హసన్ ( దేవగౌడ గతంలో ఎంపీగా గెలిచారు) లో పుట్టి సినిమాయే ఫ్యాషన్‌గా బతికిన ఈ 40 ఏళ్ల కుర్రాడు మొత్తం మూడు సినిమాలే తీశాడు.
తొలి సినిమా ఉగ్రం.. అది కూడా సూపర్ హిట్. ఆ తర్వాత కేజీయఫ్.. ఇప్పుడు కేజీయఫ్ 2. అతడి జీవితంలో చేసినవి మూడే సినిమాలు. మూడు సినిమాలతోనే ఎక్కడికో వెళ్లిపోయాడు. నిన్న కేజీయఫ్ 2 షో పడినప్పటి నుంచి జనాలు మరో రాజమౌళి.. రాజమౌళి 2, రాజమౌళికి సరైన మొగుడు అని కీర్తించేస్తున్నారు.
అయితే ఇప్పుడు నీల్ ముందు అసలు సిసలు సవాల్ ఉంది. కేజీయఫ్ 2ను కూడా సింపుల్‌గా రు. 100 కోట్లతో తీసేశాడు. ఇప్పుడు ప్రభాస్‌తో తీస్తోన్న సలార్ బడ్జెట్ రు. 350 కోట్లు. బడ్జెట్ మూడు ఇంతలు పెరిగింది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. పైగా కేజీయఫ్, కేజీయఫ్ 2తో అసాధారణ హీరోయిజం చూపించాడు. రేపటి రోజున సలార్‌లో ఇంతకు మించి చూపించాలి. అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. పైగా బాహుబలి, సాహోతో ఎక్కడికో వెళ్లిన ప్రభాస్ రాధేశ్యామ్‌తో దబేలున కింద పడ్డాడు. ఇప్పుడు అతడి ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ సలార్‌ను హిట్ చేయాల్సిన బాధ్యత నీల్ భుజస్కంధాల మీదే ఉంది.