విశ్వవిఖ్యాత నటసార్వభౌమ.. అని పిలిపించుకున్న అన్న ఎన్టీఆర్ అనేక మంది దర్శకులతో పనిచేశారు. అయితే.. కొందరితో ఆయన విభేదించినా.. తర్వాత తర్వాత కలుసుకున్నారు. కానీ, నటులతో మాత్రం పెద్దగా విభేదాలు పెట్టుకోలేదు. అందరితోనూ కలివిడిగా కలిసి పనిచేశారు. చిత్ర సీమలో చాలా మందిని ఎన్టీఆర్ పరిచయం చేశారు. వారితో కలిసి నటించారు. వారికి అనేక సలహాలు కూడా ఇచ్చారు. ఇలా.. చిత్రసీమలోకి అడుగు పెట్టిన కథనాయుడు డాక్టర్ ఎం. ప్రభాకర్‌రెడ్డి. అప్పటికే ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అయితే.. అన్నగారి పరిచయంతో ఆయన సినీరంగంలోకి ప్రవేశించారు.
అన్నగారితో ప్రభాకర్‌రెడ్డికి చాలా చనువు ఉండేది. సినిమా షూటింగులు ముగిసిన తర్వాత.. జరిగే పార్టీల్లోనూ ఇద్దరూ పాలు పంచుకునేవారు. అనేక సినిమాలలో ప్రభాకర్‌రెడ్డి ప్రతినాయకుడి వేషం వేస్తే.. అన్నగారు.. నాయకుడి వేషం రక్తి కట్టించారు. ఇలా సాగిన వారి ప్రయాణం.. ఆకస్మికంగా దెబ్బతింది. అప్పట్లో దాసరి నారాయణరావు, నట శేఖర కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి ఒక వర్గంగా ఉండేవారు. వీరు కాంగ్రెస్‌ను అభిమానించేవారు. తమిళనాడులో అయితే.. ఎంజీఆర్ పార్టీని అభిమానించేవారు. కానీ, ఏపీలో అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత.. వీరు సపోర్టు చేయకపోగా.. అన్నగారికి వ్యతిరేకం అజెండా తీసుకున్నారు.
దీంతో ఎన్టీఆర్ వీరిని దూరం పెట్టారు. ఇక దాసరి అయితే కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయడంతో పాటు ఈనాడుకు ధీటుగా.. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీపై పోరాటం చేయడానికే అన్నట్టుగా ఉదయం దినపత్రిక ప్రారంభించారు. ఇందులో తెలుగుదేశం పార్టీతో పాటు, ఎన్టీఆర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వార్తలు వండి వార్చేవారు. ఈ క్రమంలోనే ప్రభాకర్‌రెడ్డి మరింతగా వ్యతిరేకించడం ప్రారంభించి.. అన్నగారికి వ్యతిరేకంగా.. `మండలాధీశుడు` సినిమాను తీయడం గమనార్హం. దీనికి కృష్ణ సంపూర్ణ సహకారం అందించారు.
ఈ సినిమా 1987లో వచ్చింది. అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి. మండల వ్యవస్థను తీసుకువచ్చారు. పంచాయతీ సమితిలు ఉండేవి. ఇవి తాలూకా ( ఇప్పుడు నియోజకవర్గం) స్థాయిలో ఉండేవి. ప్రజలు ప్రతి పనికి అంత దూరం వెళ్లేందుకు నానా ఆపసోపాలు పడేవారు. అందుకే ప్రజలకు దగ్గరగా ఉండేందుకు 15 – 20 గ్రామాలను కలుపుతూ మండల వ్యవస్థ తీసుకువచ్చారు. అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ.. ప్రభాకర్‌రెడ్డి తీసుకున్న లైన్ మేరకు ఈ సినిమాను రూపొందించారు. ఇది అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది. తర్వాత టీడీపీ అధికారం కోల్పోయే పరిస్థితికి వచ్చింది.
తర్వాత.. అన్నగారికి ప్రభాకర్‌రెడ్డికి మధ్య చాలా విభేదాలు చోటు చేసుకున్నాయి. తుది వరకు వీరిద్దరూ మాట్లాడుకోకపోవడం.. రాజకీయంగా కూడా విభేదించడం.. సినీ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. వాస్తవానికి దాసరి నారాయణరావు.. ఎన్టీఆర్‌ను వ్యతిరేకించారు అనే టాక్ ఉంది. కానీ, అందరికన్నా ఎక్కువగా ఎన్టీఆర్ రాజకీయాలను వ్యతిరేకించిన నటుడు.. ప్రభాకర్‌రెడ్డి అంటారు సినీ పెద్దలు.