నట సౌర్వభౌమ ఎన్టీఆర్ – కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అడవి రాముడు సాధించిన అప్రతిహత విజయం అప్పట్లో ఓ సంచలనం. అసలు ఈ సినిమాను హిట్, బ్లాక్‌బస్టర్ హిట్.. సూపర్ హిట్ కాదు అంతకు మించి ఏ పదంతో పిలవాలో తెలియనంత హిట్ అయ్యింది. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ కొన్ని ప్లాపులతో ఉన్నారు. ఆ ప్లాపుల నుంచి బయటపడ్డారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ – జయప్రద కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమాగా అడవి రాముడు నిలిచింది.
ఈ సినిమాతో టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు రాఘవేంద్రరావు. ఆయనకు దర్శకుడిగా ఇది ఐదో సినిమా. ఈ సినిమా అప్పటి తెలుగు ప్రజలను ఓ ఊపు ఊపేసింది. దాదాపు యేడాది పాటు ఈ సినిమా మాయలో మునిగి తేలారు నాటి తెలుగు ప్రజలు. ఈ సినిమాలో వచ్చిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటను కేవలం రోజున్నరలో షూట్ చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు.
ఇలాంటి కమర్షియల్ హిట్ సాంగ్ ఈ రోజుల్లో కూడా ఎవ్వరు తీయలేదన్నంత గొప్ప ప్రశంస ఈ పాట దక్కించుకుంది. ఈ పాటతో పాటు కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి సాంగ్.. ఈ రెండు పాటలు కలిపి మూడు రోజుల్లో తీసేశారు. ఇలాంటి బ్లాక్‌బస్టర్ సాంగ్స్‌ను కేవలం మూడు రోజుల్లో తీయడం రాఘవేంద్రరావుకే సాధ్యమైంది. ఈ రెంటు పాటలు ఎన్టీఆర్ – జయప్రదపై చిత్రీకరించారు.
అడవి రాముడు షూటింగ్ కేవలం 35 రోజుల్లో పూర్తయ్యింది. అసలు ఈ సినిమా సాధించిన వసూళ్లు, రికార్డులు చూస్తుంటే కళ్లు జిగేల్ మంటాయి. ప్రపంచ చరిత్రను క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అన్నట్టుగా
తెలుగు సినిమా కమర్షియల్ చరిత్రలో అడవి రాముడును కూడా ట్రేడ్ వర్గాలు అలాగే విభజించి చెప్పాయి. అడవి రాముడు ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా సాధించిన రికార్డులను చూద్దాం.
అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఫస్ట్ వీక్‌లో ఎంత పెద్ద గొప్ప సినిమాకు అయినా రు. 20 లక్షలు కూడా రాలేదు. కానీ ఈ సినిమాకు ఫస్ట్ వీక్‌లోనే రు. 23 లక్షల వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత ఇదే రికార్డును ఎన్టీఆర్ మరో 15 – 16 సార్లు క్రాస్ చేశారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా రు. 4 కోట్లు కొల్లగొట్టింది. అప్పటి వరకు దానవీర శూరకర్ణ, లవకుశ లాంటి సినిమాలకు లాంగ్ రన్లో రు. కోటి వసూలు చేస్తే ఇది ఏకంగా రు. 4 కోట్లు కొల్లగొట్టింది. ఈ వసూళ్లను ఇప్పటి వసూళ్లలో లెక్కిస్తే సింపుల్గా రు. 400 కోట్లు… ఇంకా పగడ్బందీగా కౌంట్ చేస్తే రు. 500 కోట్లు అవుతుంది.
షోలే రికార్డు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ అడవి రాముడు :
అప్పటి వరకు ఒక్క స్టేట్‌లో ఓ సినిమా 3 కేంద్రాల్లో యేడాది పాటు ఆడడం అమితాబ్ షోలకే దక్కింది. షోలే మహారాష్ట్రలోని బాంబే – నాసిక్ – పూణేలో 365 రోజులు ఆడింది. అయితే అడవి రాముడు నాడు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో 365 రోజులు ఆడి ఎప్పటకీ చెక్కు చెదరని రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరాంధ్రలో వైజాగ్ – నైజాంలో హైదరాబాద్ – సీడెడ్‌లో కర్నూలు – కోస్తాలో విజయవాడలో ఈ ఫీట్ నమోదు చేసింది. ఈ రికార్డును హమ్ అప్‌కే హై కౌన్, ప్రేమాభిషేకం సమం చేశాయే తప్పా దాటలేదు.
అడవి రాముడు విజయాన్ని బాలీవుడ్ సైతం చూసి ఆశ్చర్యపోయింది. ఈ సినిమాను సౌత్ ఇండియన్ షోలే అని నాటి బాలీవుడ్ పత్రికలు కీర్తించాయి. విజయవాడ లాంటి చోట్ల అంతకుముందు హయ్యస్ట్ వసూళ్లు రు. 5 లక్షలు అయితే ఇది మూడు రెట్లు అధికంగా రు. 15 లక్షలు రాబట్టింది. వైజాగ్‌లో అప్పటి వరకు రు. 4 లక్షలు హయ్యస్ట్ అయితే ఈ సినిమా రు. 13 లక్షలు కొల్లగొట్టింది. హైదరాబాద్‌లో రు. 12 లక్షలను బ్రేక్ చేసి రు. 25 లక్షలు రాబట్టింది. ఈ రికార్డుల పరంపరలో అడవి రాముడు కర్నూలులో మరో అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది.
కర్నూలులో అప్పటి వరకు ఏ సినిమా సంవత్సరం ఆడలేదు. అక్కడ 150 రోజులు మాత్రమే ఆడిన చరిత్ర అడవి రాముడు తిరగరాసి యేడాది పాటు ఆడింది. అయితే అడవి రాముడు మూడు థియేటర్లలో 100 రోజులు ఆడి ఓవరాల్‌గా 365 రోజులు ఆడింది. ముందు రిలీజ్ అయిన థియేటర్లో 100 రోజులు, ఆ తర్వాత మరో థియేటర్‌కు మారి అక్కడ మరో 105 రోజులు.. మూడో సారి మరో థియేటర్లో 161 రోజులు ఆడి.. మొత్తంగా యేడాది పాటు ఆడింది. ఇక నెల్లూరు కనకమహాల్ లో 5 షోలతో 105 రోజులు ఆడింది. ఒక సినిమా అప్పట్లో 5 షోలతో పది రోజులు కూడా ఆడలేదు.. కాని నెల్లూరులో క్రౌడ్ విపరీతంగా ఉండడంతో థియేటర్ వాళ్లు ఏకంగా 105 రోజులు 5 షోలు వేశారు. ఇది కూడా పెద్ద సంచలనం.