హైదరాబాద్‌లో గత కొంత కాలంగా రేవ్ పార్టీలు, పబ్‌ల సంస్కృతి అయితే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలు చోట్ల లేట్ నైట్ పార్టీలు మామూలు అయిపోయాయి. ఈ పార్టీల్లోనే డ్రగ్స్ వాడడం కామన్ అయిపోయింది. పోలీసులు కూడా పెద్ద తలకాయలను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నా ఒత్తిళ్లతో వారిని వదిలి వేస్తూ ఉండడంతో ఈ దందాకు బ్రేక్ పడడం లేదు. తాజాగా బంజారాహిల్స్ పబ్‌పై పోలీసులు జరిపిన డెకాయ్ ఆపరేషన్లో డ్రగ్స్ భాగోతం కూడా బట్టబయలు కావడంతో పాటు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పబ్ నుంచి స్టేషన్‌కు తరలించిన 150 మందిలో కేవలం ఆరుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరి నుంచి డ్రగ్స్ అని అనుమానంగా ఉన్న ప్యాకెట్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో దొరికిన డ్రగ్స్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పోలీసులు పంపిస్తున్నారు. ఇక పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెతో పాటు, ఆమె స్నేహితురాళ్లు, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు, మాజీ డీజీపీ కుమార్తె ఇలా మంది సెలబ్రిటీల వారసులు ఉన్నారని తెలుస్తోంది.
ఈ రోజు తెల్లవారు ఝామున బంజారాహిల్స్‌లో లేట్ నైట్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్ వాళ్లకు వచ్చింది. వాళ్లు పక్కా ప్లానింగ్‌తోనే రాడిసన్ బ్లూ హోటల్లో దాడులు చేశారు. ఇక దాడుల్లో పట్టుబడిన సెలబ్రిటీల పిల్లలు తాము డ్రగ్స్ వాడలేదని.. తమ వారసులకు సంబంధం లేదని చెపుతున్నా కూడా వారిలో దాదాపుగా అందరూ డ్రగ్స్ మత్తులోనే మునిగి తేలుతున్నారట. అప్పటికే అక్కడ వాడేసి పడేసిన ప్యాకెట్లను పదుల సంఖ్యలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక కొందరు సెలబ్రిటీల పిల్లలు అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నానా హంగామా క్రియేట్ చేశారు. తాము ఏ తప్పు చేయలేదని.. తమను ఎందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారంటూ పెద్ద వీరంగమే చేశారు. అయితే విచారణ అనంతరం కొందరిని విడిచిపెట్టగా.. కొందరు ఒత్తిళ్లతో కూడా పోలీసులు కొందరిని వదిలి వేశారని తెలుస్తోంది. ఇక సెలబ్రిటీల పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ.. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడంతో వారి తల్లిదండ్రులు రంగంలోకి దిగి తమ పిల్లలు ఏ తప్పు చేయలేదని క్లీన్ చిట్ సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం విచిత్రంగా ఉంది.