స్టార్ హీరోయిన్ నయనతార పదేళ్ల నుంచి తాను సినిమాలు చేయాలంటే కొన్ని కండీషన్లు పెట్టుకుంది. ఆ కండీషన్‌కు ఎవరైనా ఓకే చెపితేనే ఆమె సినిమా చేస్తుంది లేకపోతే అంతే.. ఆమె కాల్షీట్లు ఇవ్వదు. అందుకు అనుగుణంగానే అగ్రిమెంట్లు ఉంటాయ్. ఆమె దృష్టిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ అయినా… మెగాస్టార్ చిరంజీవి అయినా ఒక్కటే.. ఇప్పటి వరకు ఆమె ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. అయితే ఇప్పుడు ఆమెకు పెద్ద చిక్కే వచ్చి పడింది.. తాను ఇప్పటి వరకు పెట్టుకున్న రూల్స్‌ను బ్రేక్ చేయక తప్పని పరిస్థితి.
నయనతార తాజా చిత్రం “కాథువాకుళ రెండు కాదల్”. ఇందులో ఆమె హీరోయి. ఈ సినిమాకు ఆమె నిర్మాత. పైగా ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఈ సినిమా కోసం ఆమె ప్రచారం చేయక తప్పని పరిస్థితి. ప్రచారం చేస్తే బయట నిర్మాతలకు ఒక రూల్.. ఇప్పుడు తాను నిర్మాతగా మారితే మరో రూలా ? అన్న విమర్శలు ఆమెపై వస్తాయి.. వస్తాయి కాదు.. నయన్ ఈ సినిమాకు ప్రచారం చేస్తుందన్న వార్తలతో ఇప్పటికే ఆమెపై కోలీవుడ్ నిర్మాతలు, ఇతర సినిమా జనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నెల 28న ఈ సినిమా వస్తోంది. ఈ రోజు బీస్ట్ రిలీజ్ అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అవుతాయి. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాకు మరింత బజ్ రావాలంటే ఖచ్చితంగా నయన్ మీడియా ముందుకు రావాల్సిందే. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించిన సమంతతో కలిసి నయనతార మీడియా ముందుకు రాబోతోందట.
ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి.. అప్పుడెప్పుడో ప్రభుదేవాతో బ్రేకప్ అయినప్పుడే నయనతార మీడియాకు దూరం అయ్యింది. అప్పటి నుంచి ఆమె మీడియా ముందుకు రాలేదు. ఇక సమంత కూడా నాగచైతన్యతో విడిపోయాక మీడియాకు దూరమైంది. అలా ఈ ఇద్దరు క్రేజీ హీరోయిన్లు.. తమ బ్రేకప్‌ల తర్వాత ఓ సినిమా ప్రమోషన్ కోసమే మళ్లీ కలిసి మరీ మీడియా ముందుకు వస్తున్నారు. ఏదేమైనా నయన్ భర్త కోసం రూల్స్ బ్రేక్ చేసి కోలీవుడ్ జనాలకు బాగా టార్గెట్ అయ్యేలా ఉంది.