టాలీవుడ్‌లో మెగా, మంచు ఫ్యామిలీల వివాదం ఈ నాటిది కాదు. చిరంజీవి, మోహన్‌బాబు ఇద్దరూ నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే 2007లో జరిగిన వజ్రోత్సవాల సందర్భంగా మోహన్ బాబు చిరంజీవికి అవార్డు ఇస్తోన్న క్రమంలో బహిరంగంగానే తన అసహనాన్ని వెళ్లకక్కిన తీరు ఇప్పటకీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోహన్‌బాబును వెటకారం చేస్తూ కౌంటర్ ఇవ్వడం.. చిరంజీవి అసహనం వ్యక్తం చేయడం జరిగిపోయాయి.
తర్వాత మోహన్‌బాబు, చిరంజీవి మళ్లీ కలిశారు. అలా గొడవలు పడడం.. మళ్లీ కలిసి పోవడం కామన్‌గా జరుగుతూ వస్తోంది. నరేష్ మా అధ్యక్షుడు అయినప్పుడు రాజశేఖర్ రచ్చ చేసినప్పుడు చిరు – మోహన్‌బాబు కలిసే ఉన్నారు. ఆ తర్వాత మొన్న మా ఎన్నికల సమయంలో మోహన్‌బాబు వర్సెస్ చిరు మధ్య ఉప్పు నిప్పు వాతావరణం అయిపోయింది. మా ఎన్నికలు మెగా కాంపౌండ్ వర్సెస్ మంచు కాంపౌండ్ అన్నట్టుగా పెద్ద యుద్ధాన్ని తలపించేలా జరిగాయి.
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజకు సపోర్ట్ చేసిన నాగబాబు ఆయన ఓడిపోయాక తన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి కలకలం రేపారు. అప్పటి నుంచి చిరు మౌనంగా ఉన్నా మెగా బ్రదర్ నాగబాబు మాత్రం మంచు ఫ్యామిలీని కెలుకుతూనే వస్తున్నారు. మొన్నామధ్య మోహన్‌బాబు రెండో కుమారుడు మనోజ్ హయ్యర్ పర్పస్ అనే పదం ఉపయోగిస్తూ నాగబాబుకు పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం.. ఆ వెంటనే నాగబాబు కూడా మనోజ్‌ను కార్నర్ చేస్తూ కౌంటర్ ఇవ్వడం జరిగాయి.
తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో మరోసారి మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియాను వెటకారం చేస్తూ కౌంటర్ ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. తన అభిమానులతో నాగబాబు చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. కేజీయఫ్ 2, త్రిబుల్ ఆర్ సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చిందని ఓ అభిమాని ఆయన్ను ప్రశ్నించారు. అందుకు నాగబాబు స్పందిస్తూ తనకు ఈ రెండు నచ్చలేదని.. ఓ లెజెండరీ గ్రాఫిక్స్ మూవీ నచ్చిందని చెప్పారు.
నాగబాబు అన్న లెజెండ్రీ గ్రాఫిక్స్ మూవీ అనేది మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియాయే అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. లెజెండ్రీ అన్న పదంతో పాటు సన్నాఫ్ ఇండియా ప్రి రిలీజ్ వేడుకలో మోహన్‌బాబు ఓ సాంగ్ కోసం గ్రాఫిక్స్‌కు భారీగా ఖర్చు చేసినట్టు చెప్పారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నాగబాబు ఆ సినిమాపైనే సెటైర్ వేశారని అంటున్నారు. ఇక సన్నాఫ్ ఇండియా ఘోరమైన డిజాస్టర్ కావడంతో నాగబాబు మళ్లీ మంచు ఫ్యామిలీని గుచ్చుతూ కెలికినట్టే తెలుస్తోంది.