మూడేళ్ల క్రితం వచ్చిన కేజీయఫ్ ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నెన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. కన్నడ హీరో యశ్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీయఫ్ సౌత్‌లోనే కాకుండా.. అటు బాలీవుడ్‌లోనూ ఓ ఊపు ఊపేసింది. బాహుబలి తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా నార్త్ సినీ జనాలు ఊపేయడంతో అసలు నార్త్ ఇండస్ట్రీ భయపడిపోయింది. సౌత్ సినిమాల డామినేషన్ ఏంట్రా బాబు అని తలలు పట్టుకుంది.
ఇప్పుడు ఈ సినిమాకు కంటిన్యూగా వస్తోన్నకేజీయఫ్ 2 ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేజీయఫ్ సంచలన విజయం సాధించాక వస్తోన్న ఈ సినిమాపై సౌత్‌లో మాత్రమే కాదు.. నార్త్‌లోనూ తిరుగులేని అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలుగులో ఈ సినిమాకు జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అసలు ఇది నిజమా ? అనిపిస్తుంది.
చివరకు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు రామ్‌చరణ్ కలిసి.. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమాను మించిన ప్రి రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేజీయఫ్ 2కు రు 112.50 కోట్ల బిజినెస్ జరిగితే.. ఒక్క నైజాంలోనే రు. 50 కోట్లకు అవుట్ రైట్‌గా టాప్ నిర్మాత దిల్ రాజు రైట్స్ సొంతం చేసుకున్నారు. నైజాంలో ఆచార్య రైట్స్‌ను వరంగల్ శ్రీను రు. 42 కోట్లకు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆచార్యను మించి ఈ సినిమా రైట్స్ రాజు కొన్నారు.
అసలు ఈ బిజినెస్ లెక్కలు చూస్తుంటేనే మైండ్ పోయేలా ఉంది. అయితే ఒకవేళ అంత వసూళ్లు రాకపోతే సలార్‌ను 30 % డిస్కౌంట్‌తో ఇస్తామన్న హామీ ఏదో దిల్ రాజుకు వచ్చిందన్న ఓ గాసిప్ కూడా బయటకు వచ్చింది. కేజీయఫ్ 1 ఎంత పెద్ద హిట్ అయినా ఇక్కడ టోటల్ రన్లో వసూలు చేసింది రు. 14 కోట్లే. అయితే ఇప్పుడు ఆ మొత్తానికి మూడున్నర రెట్లకు కేజీయఫ్ 2 రైట్స్ కొన్నారు. అంటే సినిమా ఏ రేంజ్‌లో హిట్ అవ్వాలో ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సీడెడ్‌లో రు. 20 కోట్లు పలకడం మరో షాకింగ్ విషయం.
మహేష్‌బాబు లాంటి స్టార్ హీరో సర్కారు వారి పాట రైట్సే రు. 40 కోట్లకు కొన్నారు. మరోవైపు చిరు , చెర్రీతో పాటు కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ ఉన్న ఆచార్యను రు. 42 కోట్లకు కొన్నారు. అలాంటిది కేజీయఫ్ 2పై ఏ ధైర్యంతో ఇంత పెట్టుబడి పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు జక్కన్న సినిమాలకు మాత్రమే నైజాంలో పెద్ద వండర్స్ క్రియేట్ అయ్యాయి. అక్కడ త్రిబుల్ ఆర్ రు. 100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. మరి కేజీయఫ్ 2 ఏం చేస్తుందో ? చూడాలి.