ఎవరు ఔనన్నా.. కాదన్నా తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. అది కొంతమంది దర్శకులో లేదా హీరోలో లేదా టెక్నీషియన్ల వల్లో అన్నది ఒప్పుకోవాలి. అయితే వాళ్లను చూపించే చాలా మంది తమకుకూడా భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు ఇవ్వాలని డిమాండ్లు, కమాండ్లు చేస్తున్నారు. వీరు చేసే పావలా పనికి పది రూపాయల బిల్డప్ కొట్టుకుంటున్నారు. ఆ బిల్డప్‌తోనే కోట్లలో రెమ్యునరేషన్లు అడుగుతూ ఉంటారు. నిర్మాతలు కూడా చేసేదేం లేక వాళ్లు అడిగినంత ఇచ్చుకుంటున్నారు.
తెలుగు సినిమాల్లో కోట్లకు కోట్లు గుమ్మరిస్తారు. భారీ ఎత్తున హీరోయిజం ఎలివేషన్లు ఉంటాయి. సెట్లు చూస్తే కళ్లు జిగేల్‌మనేలా ఉంటాయి. అయితే గుర్తు పెట్టుకునే.. మనస్సును హత్తుకునే డైలాగ్ ఒక్కటీ ఉండదు. అసలు తెలుగులో రికార్డులు కోటలు దాటేసి.. ప్రపంచ స్థాయికి వెళ్లిపోమాయని చెప్పుకునే సినిమాల్లోనూ ఇదే తంతు. అయితే తాజాగా వచ్చిన కేజీయఫ్ డైలాగులు చూస్తుంటే ఆ సినిమా తీరే వేరు అన్నట్టుగా ఉంది.
ఒక్కసారి ఆ సినిమాలో డైలాగులు మచ్చుతునకగా కొన్నింటిని చూస్తే…
– రక్తం తో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం.. ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే కోరుకుంటుంది.
– నా కొడుకు శవాన్ని ఎవరూ మోయనక్కరలేదు…వాడి కాళ్లే వాడి శవాన్ని సమాధి వరకు తీసుకు వెళతాయి..
– ఇక్కడ తలలు శాశ్వతం కాదు.. కిరీటాలు మాత్రమే శాశ్వతం.
– నెపోటిజం..నెపోటిజం…నెపోటిజం…మెరిట్‌ను ఎదగనివ్వరా..
– ఇక ఓ భార్య తాను తల్లి కాబోతున్నాను అని హీరోకు చెప్పే సీన్ చూస్తుంటే. ఇప్పటి వరకు భారతీయ సినిమా పరిశ్రమలో ఏ డైరెక్టర్ కూడా అలా తీసి ఉండడు.. అనేంత అద్భుతంగా ఉంది. ఆ సీన్‌లో భర్తతో భార్య అమ్మ వస్తోంది అని చెప్పే డైలాగ్ అర్థం అనంతమే.. ఊహలకు కూడా దొరకదు.
– ఇంటిని ఆక్రమిస్తే అది నా సమస్య కాదు.. వీథిని ఆక్రమిస్తే నా సమస్య కాదు.. ఊరిని ఆక్రమిస్తే నా సమస్య కాదనుకోవడం వల్లేబ్రిటీషర్లు దేశాన్ని ఆక్రమించారు.
ఇలా ఎన్నెన్నో డైలాగులు.. అందులో పంచ్‌లు ఉన్నాయి.. మానవత్వం తట్టిలేపే మాటలు ఉన్నాయి.. మనస్సును హత్తుకునేవి ఉన్నాయి. సినిమా అంతా ఇదే తరహా డైలాగులు కోకొల్లలు. ఒకటి రెండు పంచ్‌లు పేల్చి కోట్లలో రెమ్యునరేషన్లు తీసుకునే మన స్టార్ రైటర్లు సైతం సిగ్గుపడే రేంజ్‌లో ఈ డైలాగులు ఉన్నాయి.