నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. బాలకృష్ణ – కోదండ రామిరెడ్డిది విజయవంతమైన కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. బాలయ్య కెరీర్ డౌన్‌లో ఉంది అనుకుంటోన్న ప్రతి టైంలోనూ కోదండ రామిరెడ్డితో హిట్ సినిమా పడేది.. బాలయ్య గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచేది. నారినారి నడుమ మురారితో పాటు బొబ్బిలి సింహం లాంటి సూపర్ హిట్లు ఇండస్ట్రీని ఊపేశాయి.
విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత టి. త్రివిక్రమ రావు బాలయ్యతో ఓ సినిమా తీయాలని అనుకున్నారు. బాలయ్య కాల్షీట్లు సంపాదించారు. అంతకు ముందే ఆయన ఎన్టీఆర్‌తో హిట్ సినిమాలు తీసి ఉన్నారు. డైరెక్టర్‌గా ఎవరిని పెట్టుకోవాలా ? అని ఆలోచించి కోదండ రామిరెడ్డిని ఫిక్స్ చేశారు. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథను ఓకే చేశారు. సినిమాలో మీనా, రోజా హీరోయిన్లు.. శారద, శరత్‌బాబు కూడా కీలక పాత్రలో నటించారు. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆ రోజుల్లోనే 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడి.. రు. 7.5 కోట్ల షేర్ కొల్లగొట్టింది.
ఈ సినిమా హిట్ అయ్యాక స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ను దర్శకరత్న దాసరి తన ఇంటికి పిలిపించుకున్నారట. సినిమా కథ చాలా బాగా రాశావ్… ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందావు ? అని అడిగారట. వెంటనే విజయేంద్ర ప్రసాద్ మీ సినిమా నుంచే సార్ అనడంతో దాసరి అవాక్కై ఏ సినిమానా ? అని ఆలోచించుకుంటున్నారట. అప్పటికే ఆయన 100 కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఉండడంతో ఆయన తన సినిమాకు, బొబ్బిలి సింహం ఎలా స్ఫూర్తి అని ఆలోచనలో పడిపోయారట.
వెంటనే విజయేంద్ర ప్రసాద్ ప్రేమాభిషేకం సినిమా సార్.. నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ రావడంతో శ్రీదేవికి తనపై ద్వేషం కలిగేలా చేసి.. వేరే వ్యక్తితో పెళ్లికి ప్రేరేపించేలా చేస్తారని.. ఇక్కడ రోజాకు క్యాన్సర్ అని తెలియడంతో తన బావ బాలయ్యకు తనపై ద్వేషం కలిగేలా చేసి.. మీనాతో పెళ్లి జరిగి.. వంశాకురాన్ని నిలబెట్టేలా గేమ్ ఆడుతుందని అనడంతో దాసరి ఒక్కసారిగా షాక్ అయ్యి.. విజయేంద్ర ప్రసాద్ భుజం తట్టారట.
ఇక దాసరిని తాను గురువుగా భావిచేవాడినని.. తన తొలి స్టోరీని ఆయనే డైరెక్ట్ చేశారని.. ఆ తర్వాత కూడా ఆయన తన కథలు చెప్పి మార్పులు, చేర్పులు ఉంటే చేయమనడంతో పాటు సలహాలు తీసుకునేవారని విజయేంద్ర ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక బొబ్బిలి సింహం తర్వాత విజయేంద్ర ప్రసాద్ అదే బాలయ్య బ్లాక్‌బస్టర్ సమరసింహారెడ్డి సినిమాకు కూడా కథ అందించారు.