కాకతాళీయమో లేదా సందర్భాన్ని బట్టో ఒక్కోసారి సినిమాల్లో సీన్లే నిజజీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాగే నిజజీవితంలో జరిగిన సీన్లు కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇటీవల వచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో హీరో జాతకాలు చెపుతూ ఉంటాడు. ఆయన చెప్పినవి జరుగుతూ ఉండేంత పేరు పామిస్ట్ రోల్లో ప్రభాస్ నటించాడు. అయితే సీనియర్ నటి జయసుధ జీవితంలో కూడా ఓ జ్యోతిష్యుడు చెప్పింది అక్షరాలా నిజం అయ్యింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు ? జయసుధ జీవితంలో ఏం జరిగిందన్నది చూద్దాం.
జయసుధ తల్లితండ్రులు జోగాబాయి, రమేశ్. జోగాబాయికి సినిమాల పట్ల ఆసక్తి ఉండడంతో కొన్ని సినిమాల్లో నటించింది. కేవి. రెడ్డి పెద్దమనుషులు సినిమాలో ఓ నృత్య సన్నివేశంలో కూడా పాల్గొన్నారు.
రమేష్ ఆ రోజుల్లోనే మద్రాస్ కార్పోరేషన్లో పనిచేసేవారు. జోగాబాయి ఇంటికి సమీపంలో ఉండేవారు. రమేష్ ఆంధ్ర విజ్ఞాన సభ పేరుతో నాటక సమాజం నిర్వహించే వారు. అక్కడే వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 1956 ఫిబ్రవరి రెండున వీరి పెళ్లి జరిగింది.
ఈ దంపతులకు సుజాత – సుభాషిణి – మనోహర్ – వెంకటేశ్పుట్టారు. సుజాత ( జయసుధ)కు సినిమాలు అంటే ఏ మాత్రం ఆసక్తి ఉండేదే కాదు. పైగా 3 గంటల పాటు తలుపులు మూసేసిన థియేటర్లో ఎవరు కూర్చొంటారు అని తల్లితో వాదించేదట. రమేష్ ( జయసుధ తండ్రి ) ఓ సారి ఫ్రెండ్స్‌తో కలిసి బెంగళూరు వెళ్లారట. అక్కడ జయా నగర్లో బాగా జాతకాలు చెపుతారని పేరున్న ఓ రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్ ఉండేవారట. ఆయన ఏం చెపితే అదే జరుగుతుందన్న నమ్మకం ఉండేదట.
రమేష్‌కు ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ ఒత్తిడి చేయడంతో ఆయన దగ్గరకు వెళ్లి చేయి చూపించుకున్నాడట. ఆయన చేయి చూసి ఏవేవో లెక్కలు వేసి మీ పెద్దమ్మాయి పెద్ద నటి అవుతుంది.. బోలెడంత పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా వస్తుందని చెప్పాడట. అయితే తన కుమార్తెకు అసలు సినిమాలంటేనే ఇష్టం ఉండదు.. ఇదంతా అబ్దధమే అని చెప్పి రమేష్ నువ్వుకున్నారట. ఓ రోజు జయసుధ ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని భార్య జోగాబాయిని అడిగారట.
పండంటి కాపురం సినిమాలో చిన్న పాత్ర ఉందంటే మీ చెల్లి ( విజయనిర్మల) తీసుకు వెళ్లిందని చెప్పిందట. విజయనిర్మల రమేష్‌కు సొంత చిన్నాన్న కూతురు. అంటే జయసుధకు మేనత్త అన్నమాట. సుజాత ఇంటికి వచ్చిన వెంటనే మనకు సినిమాలు ఎందుకు ? అని రమేష్ ఫైర్ అయ్యారట. అయితే అప్పటికే ఆ సినిమా కమిట్ అవ్వడంతో పూర్తి చేయకతప్పలేదు. ఆ సినిమా షూటింగ్ టైంలోనే ఆమెకు మరో రెండు ఆఫర్లు రావడం… ఇలా వరుస పెట్టి సినిమా ఆఫర్లు వస్తుండడంతో రమేష్ అవాక్కయ్యారట.
భార్యను వెంట పెట్టుకుని బెంగళూరు వెళ్లి మళ్లీ ఆ జ్యోతిష్యుడిని కలిశారట. అప్పుడు ఆయన ఆమెకు రాసి పెట్టి ఉందంతే… ఎవరెన్ని అవరోధాలు కలిగించినా.. ఆమె నటిగా పేరు తెచ్చుకుంటుందని చెప్పారట. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉండడంతో రమేష్ కుమార్తె సినిమా అవకాశాల విషయంలో కాదనలేకపోయారు. చివరకు ఆమె పెద్ద స్టార్ అయిపోయింది. అయితే అప్పటికే ఇండస్ట్రీలో సుజాత పేరుతో ఓ హీరోయిన్ ఉండడంతో రమేష్.. నటుడు ప్రభాకర్ రెడ్డితో చర్చించి ఆమె పేరు జయసుధగా మార్చారు. ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు.