టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందకు రానుంది. చిరు తనయుడు రామ్‌చరణ్ కూడా సినిమాలో నటించడంతో పాటు దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అంటున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు. 150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. బయ్యర్లకు ఎంత నమ్మకం ఉంటే ఈ రేంజ్‌లో సినిమాను కొంటారన్నది కూడా అర్థం చేసుకోవాలి.
ఈ సినిమాపై గత యేడాది కరోనా టైం నుంచే కాపీ మరకలు వస్తున్నాయి. తాజాగా సినిమా రిలీజ్‌కు ముందు మరోసారి కాపీ ఆరోపణలు రావడంతో గందరగోళం నెలకొంది. ఈ కథ నాదే అంటూ ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన రచయిత మండూరి రాజేష్ తాజా ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. ఆచార్య కథను తన గ్రామంలో శ్రీరామాలయంలో జరిగిన ఓ సంఘటన నుంచి స్ఫూర్తి పొంది తాను స్వయంగా రాసుకున్నాను అని ఆయన చెప్పారు.
తాను ఈ కథను అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ( బుజ్జి) ద్వారా మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన చెర్రీ అనే వ్యక్తికి చెప్పానని రాజేష్ తెలిపారు. అతడు తన కథను రికార్డ్ కూడా చేసుకున్నాడని.. అయితే ఈ కథ హెవీగా ఉంది.. పైగా ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉందని వారు అన్నారని.. అప్పుడే ఈ కథను కొరటాల లాంటి వాళ్లు టేకోవర్ చేస్తే బాగుంటుందని… సోషల్ మెసేజ్ కూడా ఉందని కూడా చెర్రీ అన్నట్టు రాజేష్ తెలిపారు.
ఆ తర్వాత వాళ్ల నుంచి తనకు ఎలాంటి రిప్లై రాలేదని.. తీరా చూస్తే కొరటాల శివ తన కథతోనే చిరంజీవి గారితో ఆచార్య సినిమా చేస్తున్నట్టు తనకు తెలిసిందన్నారు. ఆ విషయాన్ని తాను ఆచార్య యూనిట్‌లో తనకు పరిచయం ఉన్నవారితో కూడా కన్‌ఫార్మ్ చేసుకున్నానని రాజేష్ చెపుతున్నారు. ఈ కథ తనదే అని తాను అసోసియేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని.. అయితే తన కథను కొరటాలకు పంపి ఆయన ఆచార్య కథ వేరని చెప్పారని రాజేష్ వాపోయారు.
తన కథ కొరటాలకు చెప్పినప్పుడు ఆయన కథ కూడా తనతో షేర్ చేసుకోవాలి కదా.. తనకు చెప్పాలి కదా ? అని రాజేష్ ప్రశ్నిస్తున్నారు. తాను ఈ కథను బాలయ్య హీరోగా పెట్టి తీయాలన్న ప్లాన్‌తోనే రాసుకున్నట్టు కూడా రాజేష్ చెపుతున్నారు. పైగా తన కథ విన్న కొరటాలను ఆయన కథ చెప్పమన్నప్పుడు వందల కోట్ల బడ్జెట్‌తో తాను చేస్తోన్న కథ నీకెలా చెపుతానని కూడా అన్నారని రాజేష్ చెప్పారు. ఏదేమైనా ఆచార్య రిలీజ్‌కు ముందు కథపై కాపీ మరకలు రావడం కాస్త గందరగోళంగా ఉంది.