హీరోయిన్ చార్మి అంటేనే మన తెలుగు సినీ లవర్స్‌కు ఓ చార్మింగ్. అప్పుడెప్పుడో 2002 సంవత్సరంలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన దీపక్ సినిమా నీతోడు కావాలితో ఆమె తెలుగె తెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమె ఒకటి రెండేళ్లు ఛాన్సుల కోసం ఇబ్బందులు పడినా వెనక్కు తిరిగి చూసుకోలేదు. కట్ చేస్తే ఆమె తెలుగు సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. ఇప్పటకీ పెళ్లి చేసుకోకుండా ఇక్కడ స్టార్ నిర్మాతగా ఉంటూ బడా బడా స్టార్లతోనే సినిమాలు చేస్తోంది.
ఓ లేడీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్‌గా చేయడంతో పాటు ఇప్పుడు బడా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పెద్ద సినిమాలకు నిర్మాతగా మారడం అంటే మామూలు విషయం కాదు. చార్మి – పూరి కలిసి విజయ్ దేవరకొండతో చేసిన పాన్ ఇండియా మూవీ లైగర్ సైతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.’
చార్మీ పంజాబీ అమ్మాయి అయినా ఆమె అచ్చ తెలుగు అమ్మాయిలా ఇక్కడ కలిసి పోయింది. కెరీర్ చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నా అవేమి ఆమెను ఆపలేకపోతున్నాయి. అసలు ఆమె సినీ రంగ ప్రవేశం ముందుగా ఎలా జరిగింది. ఆ కథేంటో చూస్తే ఇంట్రస్టింగ్‌గానే అనిపిస్తుంది. చార్మి 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆమె తన అన్నతో కలిసి గురుద్వారాకు వెళుతోందట. ఓ వ్యక్తి చార్మిని చూసి సినిమాల్లో నటిస్తావా ? అని అడిగాడట.
వెంటనే చార్మి ఇంట్లో అమ్మకు చెప్పి షూటింగ్ స్పాట్‌కు వెళ్లిందట. ఆ సినిమా మే ప్రేమ్ కి దివానీ. అలా జూనియర్ ఆర్టిస్టుగా ముందు చార్మీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ పాత్రలో నటించినందుకు చార్మీకి రు. 200 ఫస్ట్ రెమ్యునరేషన్‌గా వచ్చిందట. ఆ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ కూడా నటించాడని.. తాను అభిషేక్‌కు వీరాభిమానిని అని.. ఆ సినిమా టైంలో అభిషేక్ తనను చూసి.. నువ్వు చాలా అందంగా ఉన్నావు… సినిమాల్లో ట్రై చేసి … బాగా సక్సెస్ అవుతావని కూడా చెప్పారట.
అభిషేక్ మాటలు విన్నాక తాను మెస్మరైజ్ అయిపోయానని.. ఇక తన మొదటి సంపాదన అంతా భోజనానికే ఖర్చయిపోయేదని.. రు. 3తో వడపావ్, రోజూ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లి రావడానికి రు. 8 ఖర్చు అయ్యేదని.. అలా ఏడు రోజుల పాటు షూటింగ్‌కు వెళ్లి రావడానికి రు. వెయ్యి ఖర్చయ్యిందని చార్మీ చెప్పింది. ఆ డబ్బుతోనే తాను 8వ తరగతి ఫీజు కట్టుకున్నానని చార్మీ చెప్పింది.