ఇటీవల కాలంలో మొబైల్ థియేటర్ అనేది బాగా పాపులర్ అవుతోంది. ఒక థియేటర్‌ను కట్టాలంటే సంవత్సరాల పాటు టైం పడుతుంది. దాని ఎలివేషన్ మొత్తం పూర్తయ్యే సరికి రోజులకు రోజులు అవుతుంది. అయితే ఇప్పుడు వెంటనే వారం, పది రోజుల్లో థియేటర్‌ను నిర్మించుకునే వెసులుబాటు వచ్చేసింది. ప్రస్తుతం నడుస్తోందంతా డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగంలో ఆ తరహా థియేటర్ల ఏర్పాటు చాలా సులువు అయిపోయింది.
గత నెలలో త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మొబైల్ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ జిల్లా కేంద్రంలో థియేటర్ లేదు. కేవలం 120 సీట్ల సామర్థ్యంతో వారం రోజుల్లోనే ఈ థియేటర్ పెట్టారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ థియేటర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అలాంటి మొబైల్ థియేటర్ ఏపీలో కూడా ఒకటి ఏర్పాటు అయ్యింది.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద కలకత్తా – మద్రాస్ జాతీయ రహదారిపై హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ మొబైల్ థియేటర్ ఏర్పాటు అవుతోంది. వెదర్ ఫ్రూప్, ఫైర్ ఫ్రూప్ సిస్టమ్‌లో వేసిన ఈ టెంట్‌లో గాలి నింపే టెక్నాలజీతో ఎయిర్ బెలూన్‌లా థియేటర్ ఉంటుంది. మొత్తం 120 సీట్ల కెపాసిటీతో ఈ థియేటర్‌ను ఏర్పాటు చేశారు.
పిక్చర్స్ డిజిటల్స్ సంస్థ ఈ థియేటర్ ఏర్పాటు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో ఈ థియేటర్ స్టార్ట్ అవుతోంది. ఒకప్పుడు మనకు టూరింగ్ టాకీస్‌లు ఉండేవి. లోపల తెర.. చుట్టూ క్లాత్‌లు కట్టి షోలు వేసేవారు. కింద కొన్ని బెంచీలతో పాటు ఇసుక మీద కూర్చుని సినిమాలు చూసేవారు. అలాంటి వాటికి ఆధునిక రూపమే ఈ బెలూన్ థియేటర్లు. ఈ థియేటర్‌ను మడత పెట్టుకుని ఎక్కడకు అయినా తీసుకుపోవచ్చు.
ఈ సిస్టమ్ ఆసిఫాబాద్‌లో ఇప్పటికే సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఏపీలో కూడా సక్సెస్ అయితే రూరల్ ప్రాంతాల్లో ఇలాంటివి మరిన్ని థియేటర్లు రానున్నాయి. రూరల్ ఏరియాల నుంచి బయట పట్టణాలకు, మండల కేంద్రాలకు వెళ్లి సినిమాలు చూడలేని వారికి ఇవి మంచి ఆప్షన్లుగా ఉంటాయి.