పదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 సినిమా కోలీవుడ్ హిట్ మూవీ కత్తికి రీమేక్. అయినా ఇక్కడ రు. 100 కోట్లకు పైగా షేర్ రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి అంచనాలు అందుకోలేకపోయినా కూడా రు. 100 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అందులో మళయాళంలో హిట్ అయిన లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్‌లో, కోలీవుడ్‌లో అజిత్ హీరోగా వచ్చి హిట్ అయిన వేదాళం రీమేక్ భోళాశంకర్‌లో, బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాల్లో చేస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తనయుడు చెర్రీతో కలిసి నటించిన ఆచార్య సినిమా పూర్తయ్యి ఏడెనిమిది నెలలు అవుతోంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 29న ఈ సినిమా థియేటర్లలోకి దిగుతోంది. మరో విశేషం ఏంటంటే అటు లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ కూడా అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఈ రోజు మెగా కాంపౌండ్ వర్గాల నుంచి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది.
మల్లూవుడ్‌లో హిట్ అయిన లూసీఫర్‌ను తెలుగు రీమేక్‌గా చాలా మార్పులు చేసే మోహన్ రాజా గాడ్ ఫాదర్ తెరకెక్కించాడు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన షూటింగ్ కూడా పూర్తయ్యింది. సల్మాన్‌తో పాటు మరి కొందరు ప్రముఖులు సైతం ఈ సినిమాలో కనిపిస్తారు. కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 11 లేదా 12న రిలీజ్ చేయనున్నారు.
అప్పుడు రిలీజ్ చేస్తే.. వీకెండ్‌తో పాటు ఇండిపెండెన్స్ డే సెలవులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చన్నదే మెగా కాంపౌండ్ ప్లాన్. ఇతర పెద్ద సినిమాలేవి పోటీ లేకుండా ఉండడంతో ఆ డేట్‌కు రావాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయారని అంటున్నారు. అయితే అదే వారంలో కళ్యాణ్‌రామ్ నటిస్తోన్న బింబిసార కూడా రిలీజ్ కానుంది. ఒకవేళ చర్చించుకుంటే బింబిసారను కాస్త ముందుకు లేదా వెనకకు జరుపుకుంటే గాడ్ ఫాదర్‌కు మరింత సోలో రిలీజ్ దక్కుతుంది.
ఇక భోళా శంకర్ సినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. అంటే వరుసగా చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన అభిమానులను.. తెలుగు సినీ ప్రేక్షకులను అలరించనున్నాడు. వచ్చే మార్చిలోనే బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అవుతోంది. ఇక వెంకీ కుడుముల తెరకెక్కించే సినిమా కూడా వచ్చే 2023లో వస్తే మెగాభిమానులకు మామూలు రచ్చ కాదు.