సినిమా రంగంలో ఎన్టీఆర్‌కు ఎప్పటకీ తిరుగులేదు. ఆయన కెరీర్ స్టార్టింగ్‌లో ఒకటి రెండు ఛాన్సుల కోసం ఇబ్బంది పడ్డారేమో గాని.. ఒక్కసారి క్లిక్ అయ్యాక అసలు ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయ్యి.. తిరిగి సినిమాల్లోకి వచ్చి కూడా ఎన్నో సూపర్ హిట్లు కొట్టారు. అటు సినిమా రంగంలో ఎన్టీఆర్ అంటే ఎంతో మందికి గౌరవం.. ఆయన మాట జవదాటేందుకు ఎవ్వరూ ఇష్టపడేవారే కాదు. ఇక సినిమాల్లో ఆయన ఎన్నో పెళ్లిళ్లు చేసుకుని ఉంటారు. అవన్నీ ఉత్తుత్తి పెళ్లిళ్లే. అయితే ఆయన నిజ జీవితంలో ఓ పెళ్లి చేశారు. ఎన్టీఆర్ ఏంటి ? నిజ జీవితంలో పెళ్లి చేయడం ఏంటని షాక్ అవుతున్నారా ? ఈ పెళ్లి వెనక పెద్ద కథే ఉంది.
ఎన్టీఆర్ స్వయంగా మంత్రాలు చదువుతూ.. స్వయంగా చేసిన పెళ్లి కావడంతో అది ఆయన జీవితంలో చరిత్రగా నిలిచిపోయిందనే చెప్పాలి. అయితే ఈ పెళ్లి అనూహ్యంగా జరగలేదు. ఎన్టీఆర్ ఆసక్తి మేరకే జరిగింది. ఇక ప్రస్తుతం తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఎన్టీఆర్‌కు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా యార్లగడ్డకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. సినిమాల్లో ఎన్టీఆర్ స్టార్‌గా ఉన్నప్పటి నుంచే ఈ బంధం ఉంది.
ఇక ఎన్టీఆర్‌కు ముందు నుంచి భక్తి అంటే చాలా ఇష్టం. పూజలు, పునస్కారాలు, నమ్మకాలు, సెంటిమెంట్లు ఉండేవి. బహుశా అదే ఆయన తనయుడు బాలకృష్ణకు కూడా వచ్చి ఉంటుంది. ఎన్టీఆర్‌కు ఇంత భక్తిభావం ఏర్పడడానికి ఆయన చేసిన పౌరాణిక చిత్రాలు కూడా ఓ కారణం కావచ్చు. ఇక ఎన్టీఆర్‌కు ముందు నుంచి తిరుపతి వెంకట కవులతో ఉన్న సాన్నిహిత్యం కూడా ఆయన పురాణాల పట్ల ఎక్కువుగా ఆకర్షితులు అయ్యేందుకు మరో కారణం. ఈ క్రమంలోనే పూజలు ఎలా ? చేయాలి ? ఏయే మంత్రాలు చదవాలి ? పెళ్లిళ్ల వెనక ఉన్న అంతరార్థం ఏంటి ? వంటి విషయాలపై చాలా ఆసక్తితో పాటు పట్టు ఉండేది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పెళ్లిళ్లు చేయడం తిరుపతి వెంకట కవుల దగ్గర నేర్చుకున్నారు. ఈ విషయం యార్లగడ్డకు తెలుసు. అందుకే యార్లగడ్డ కోరిక మేరకు ఆయన కుమార్తెకు స్వయంగా అన్నగారు పీటలపై కూర్చుని.. పురోహితుని మాదిరిగా మంత్రాలు చదువుతూ పెళ్లి చేయించారు. ఈ వివాహం సాక్షాత్తు ఎన్టీఆర్ చేయడం అప్పట్లో ఓ సెన్షేషన్. అంతేకాదు ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ వివాహం సైతం స్వయంగా ఎన్టీఆరే చేయించడం విశేషం.
ఈ రెండు వివాహాలపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఎక్కువుగా తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు. ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు చేసినా కూడా ఆయనకు మళ్లీ పౌరాణిక పాత్రల్లో నటించాలన్న కోరిక చివర్లో కూడా ఉండేది. అయితే ఒకటి రెండు సినిమాలు మినహా ఎక్కువుగా చేయలేకపోయారు.