విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఉన్నాయి. వెంకటేష్ కెరీర్‌లో మర్చిపోలేని సినిమాల్లో చంటి ఒకటి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత కేఎస్. రామారావు నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకుడు. అమ్మ, చెల్లి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. సినిమాలో పాటలతో పాటు, ప్రేమ, సెంటిమెంట్ సీన్లు ఊపేశాయి. సినిమా కథ విషయానికి వస్తే జమందారి కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయికి ముగ్గురు అన్నలు ఉంటారు.
లేకలేక కలిగిన ఆడపిల్ల కావడంతో ఆ చెల్లిని ఆ ముగ్గురు అన్నదమ్ములు ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఇక వెంకటేష్ పెద్ద అమాయకుడిగా నటించాడు. అమాయకపు పాత్రలో ఉండే ఈ హీరోకు తల్లి సుజాత మాత్రమే లోకం. అయితే చంటిని నందినికి రక్షణగా పెడతారు ఈ ముగ్గురు అన్నదమ్ములు. అయితే నందిని చంటి అమాయకత్వం చూసి అతడితో ప్రేమలో పడిపోతుంది. చివరకు అన్నదమ్ములు చెల్లి నందిని కోరిక మేరకు చంటితో పెళ్లి చేస్తారు.
తమిళంలో హిట్ అయిన చిన్నతంబి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. అయితే కేఎస్. రామారావు అసలు తమిళ సినిమా చిన్న తంబి రిలీజ్ కాకముందే ఈ సినిమాను రాజేంద్ర ప్రసాద్‌తో చేయాలని భావించారట. చిన్న తంబి రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక రాజేంద్రప్రసాద్‌తో ఈ సినిమా చేయాలని ఆయన అనుకుంటోన్న టైంలో సురేష్‌బాబు కేఎస్. రామారావు దగ్గరకు వెళ్లి వెంకటేష్‌తో ఈ సినిమా చేయమని అడిగారు.
ఈ టైంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ఈ సినిమాను వెంకటేష్ హీరోగా చేయాలని దర్శకుడు రవిరాజా పినిశెట్టిని ఒప్పించారట. అంటే రాజేంద్రప్రసాద్‌కు, చిరంజీవికి గ్యాప్ ఏమీ లేకపోయినా..ఈ కథ వెంకీకి బాగా సూట్ అవుతుందని చిరు భావించడంతో పాటు తనకు బాగా ఫ్రెండ్ అయిన రవిరాజా పినిశెట్టికి ఓ మంచి ఛాన్స్ ఇప్పించాలన్నదే చిరు ప్లాన్.
అయితే చిరు ఇన్వాల్‌మెంట్, అటు సురేష్‌బాబు కూడా అడగడంతో ఈ సినిమా నుంచి రాజేంద్రప్రసాద్ పూర్తిగా సైడ్ అయిపోయాడు. అలా రాజేంద్రప్రసాద్‌కు దక్కాల్సిన బ్లాక్‌బస్టర్ హిట్ కాస్తా వెంకీ ఖాతాలో పడిపోయింది. అప్పట్లో వెంకీ ఎన్నో రికార్డులు తిరగరాసింది. నాటి పల్లెటూరి జనాలను ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది.