టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్‌బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మహేష్ సినిమా వస్తుందంటే టాలీవుడ్ మొత్తం షేక్ అయ్యి పోవాల్సిందే. పైగా ఇప్పుడు మహేష్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. భరత్ అనే నేను – మహర్షి – సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్లు.. మార్కెట్ పెరిగింది. ఇక తాజాగా మహేష్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. పరశురాం దర్శకత్వంలో నటిస్తోన్న సర్కారు వారి పాట వచ్చే నెల 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా.. ఆ వెంటనే రాజమౌళి సినిమా ఉంది.
ఈ క్రమంలోనే సర్కారు వారి పాటపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఏపీ, తెలంగాణలోనే ఏకంగా రు. 80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలోనే రు. 30 కోట్లకు ఈ సినిమా రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. సర్కారు వారి పాటను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మహేష్ సినిమాకు మరో క్రేజీ హీరో సినిమా నుంచి పోటీ తప్పడం లేదు.
కోలీవుడ్‌లో శివ కార్తీకేయన్ క్రేజీ హీరో. మనోడి సినిమా వస్తుందంటే చాలు అక్కడ జనాలు పిచ్చెక్కిపోతారు. గతేడాది వరుణ్ డాక్టర్ సినిమాతో సౌత్ సినిమాను మనోడు షేక్ చేశాడు. శివ కార్తీకేయన్‌కు తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. శివ నటించిన తాజా సినిమా డాన్. సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 13న రిలీజ్ అవుతోంది. యాక్షన్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించడంతో సినిమాపై హైప్ మామూలుగా లేదు. స్టిల్స్‌తో పాటు గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమాకు తెలుగులోనూ హైప్ ఉంది. రైట్స్ కోసం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఒక్క రోజు ముందు మహేష్ సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అవుతోంది.
తమిళనాడు వరక ఎలా ఉన్నా ? తెలుగులో మహేష్ సినిమా పోటీని తట్టుకుని డాన్ నిలబడుతుందా ? లేదా కేజీయఫ్ 2 హోరులో బీస్ట్ కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుందా ? తెలుగులో మినిమం వసూళ్లు అయినా వస్తాయా ? అన్నది చూడాలి.