ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హడావిడి.. పెద్ద సినిమాల హడావిడే నడుస్తోంది. బన్నీ పుష్ప పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అందరి దృష్టి త్రిబుల్ ఆర్ మీదే ఉంది. త్రిబుల్ ఆర్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. అటు నార్త్ నుంచి.. ఇటు సౌత్ వరకు అందరిని ఊపేస్తోంది. త్రిబుల్ ఆర్ దెబ్బ అయితే నార్త్‌లో మామూలుగా లేదు. ఇప్పుడు సౌత్ సినిమాలు అంటేనే బాలీవుడ్‌తో పాటు హిందీ వర్గాలు అన్ని భయపడుతున్నాయి. ఎందుకంటే ఒక్క రోజు తేడాలో రిలీజ్ అవుతోన్న రెండు సౌత్ సినిమాలు ఇప్పుడు నార్త్‌ను భయపెట్టేస్తున్నాయి.
ఈ నెల 13న కోలీవుడ్ ఇళయ దళపతి నటించిన బీస్ట్ థియేటర్లలోకి వస్తోంది. ఉగ్రవాద నేపథ్యం కథాంశంతో ఈ సినిమా వస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇక ఆ మరుసటి రోజు దేశవ్యాప్తంగా మూడేళ్ల క్రితం ఎన్నో సంచలనాలు రేకెత్తించిన కేజీయఫ్ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 2 వస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండానే కేజీయఫ్ సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ దుమ్ము దులిపేసింది. ఇప్పుడు కేజీయఫ్ 2 కూడా అదే అంచనాలు అందుకుంటుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే బీస్ట్ కూడా పాన్ ఇండియా లెవల్లో వస్తూ రిలీజ్‌కు ముందే సంచలనాలు రేకెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా బీస్ట్ అక్కడ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాను కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేయడంతో పెద్ద ఎదురు దెబ్బే తగిలినట్టు అయ్యింది.
కువైట్ ప్రభుత్వం బీస్ట్ రిలీజ్‌ను తమ దేశంలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ప్రభావం అరబ్ కంట్రీస్‌లో పడనుంది. సినిమాలో పాక్ టెర్రరిస్టులు మరియు హింసను చిత్రీకరించిన కారణంగానే ఈ బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ కురుపుతో పాటు ఎఫ్ఐఆర్ సినిమాలను కూడా నిషేధించారు. గత రెండు సినిమాలకు తోడుగా ఇప్పుడు బీస్ట్‌ను కూడా బ్యాన్ చేయడం సంచలనంగా మారింది.
వరుసగా భారతీయ సినిమాలను నిషేధించడంపై అక్కడ ఉన్న భారతీయులు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. కువైట్‌లో సెన్సార్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయంటున్నారు. అక్కడ భారతీయులతో పాటు పాకిస్తాన్ దేశీయులు, ముస్లింల సంఖ్య కూడా ఎక్కువే. హిందీ భాష మాట్లాడేవారు అధిక సంఖ్యలో ఉంటారు. బీస్ట్ హిందీలో రిలీజ్ అవుతోంది. అందుకే భారతీయులు, ముస్లింల మధ్య సంఘర్షణలు లేకుండా ఉండేందుకు కువైట్ ఇలా చేసిందని టాక్ ?