అసలు ఈ టైటిల్ వింటుంటేనే ఫ్యీజులు ఎగిరిపోయేలా ఉంది. టాలీవుడ్‌లోనే నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసి వరల్డ్ వైడ్‌గా తీసుకుపోయారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఏ రేంజులో ఊహించుకోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య ప్రి రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ వేడుకకు రాజమౌళిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు చిరంజీవి. చిరునే స్వయంగా రాజమౌళిని ఆహ్వానించారని టాక్ ? పైగా ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమా టైంలో చిరు – రాజమౌళి బంధం మరింత బలపడింది. త్రిబుల్ ఆర్‌లో చిరు తనయుడు చెర్రీ కూడా నటించారు. చెర్రీ నటించిన త్రిబుల్ ఆర్ తర్వాత నెలన్నర రోజుల గ్యాప్‌లోనే మరోసారి చెర్రీ ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజమౌళి కూడా సినిమా ప్రమోషన్లకు ఎంతైనా హెల్ఫ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ వేడుక వేదిక మీదే చిరంజీవి – రాజమౌళి సినిమాపై బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఒక్కటే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. గతంలో కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను ఓ సినిమా చేస్తానని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఓ సినిమా ఫంక్షన్ వేదిక మీద త్రివిక్రమ్ చేయి పట్టుకుని మరీ చిరుయే స్వయంగా ఈ ప్రకటన చేశారు. అప్పుడు త్రివిక్రమ్ కూడా పట్టరాని ఆనందంతో ఎస్ అన్నట్టుగా తలూపారు.
ఆ తర్వాత ఈ సినిమా ఊసే లేకుండా పోయింది. త్రివిక్రమ్ కూడా ఈ సినిమా గురించి తర్వాత మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఆచార్య ప్రి రిలీజ్ ఫంక్షన్ వేదికగా రాజమౌళి – చిరు సినిమాపై కొత్త సినిమా చిరుయే స్వయంగా ప్రకటించబోతున్నారట. ఈ వార్త అయితే ఇండస్ట్రీలో నిన్నటి రాత్రి నుంచి దానవాలంలా వ్యాపిస్తోంది. రాజమౌళి నెక్ట్స్ సినిమా మహేష్‌తో ఉంది. అది ఎలా లేదన్నా.. ఎంత స్పీడ్‌గా తీసినా .. ఏ 2024లోనో రిలీజ్ అవుతుంది.
అంటే చిరు – రాజమౌళి సినిమా ఆ తర్వాతే ఉంటుంది. చిరు చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చే యేడాదికే కంప్లీట్ అవుతాయి. అంటే రాజమౌళి… మహేష్ సినిమా పూర్తి చేసిన వెంటనే చిరు సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేయాలి. రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండున్నరేళ్లు.. ఇంకా చెప్పాలంటే మూడేళ్లు కేటాయించాలి.
ఇప్పటికే ఆరున్నర పదుల వయస్సులో ఉన్న చిరు కెరీర్ ఎండింగ్ స్టేజ్‌లో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్న తాపత్రయంతోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ టైంలో ఒక్క సినిమా కోసం రాజమౌళికి అది కూడా మరో రెండున్నరేళ్ల తర్వాత ఇస్తారా ? అన్నది కాస్త సందేహమే. త్రివిక్రమ్ తలచుకుంటే ఒక సినిమాను 6 – 8 నెలల్లో పూర్తి చేస్తాడు. అలాంటి త్రివిక్రమ్‌తోనే సినిమా చేయలేదు.. మరి ఇప్పుడు రాజమౌళి సినిమాపై అసలు ప్రకటన ఉంటుందా ? లేదా ? అన్నది చూడాలి.