మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. సైరా తర్వాత చిరంజీవి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తొలిసారిగా చిరుతో పాటు తనయుడు రామ్‌చరణ్ కూడా కలిసి నటించడం, అటు టాలీవుడ్‌లో అసలు ప్లాప్ అన్న పదం లేకుండా వరుసగా సూపర్ హిట్లు కొడుతూ వస్తోన్న కొరటాల శివ ఈ సినిమా డైరెక్టర్ కావడం మరో విశేషం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
రామ్‌చరణ్ ఈ సినిమాలో సిద్ధ అనే కీలక పాత్రలో కనిపిస్తాడు. అసలు ఈ కథ ధర్మస్థలిలో ఉండే సిద్ధదే అని తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల సిద్ధ ధర్మస్థలి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు నక్సలిజంలో చేరతాడు. అక్కడ ఉండే ఆచార్య అయిన చిరంజీవితో పరిచయం ఏర్పడడం.. సిద్ధ చెప్పిన బాధలు విని ధర్మస్థలికి వెళ్లి అక్కడ వాళ్లను కాపాడడమే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.
ఇటు ధర్మస్థలి అనే ఊరు సమస్య, దేవాలయం, భూములకు, నక్సలిజానికి లింక్ పెట్టి కొరటాల ఈ సినిమా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి భలే భలే బంజారా” అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ ఈ సాంగ్ నాకు ఎప్పటకీ గుర్తుండి పోతుందని.. ఈ సాంగ్ కోసం నా ఎనర్జిటిక్ రామ్‌చరణ్‌తో కలిసి కాలు కదపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అలాగే సాంగ్‌లో తన గ్రేస్‌తో తాను చరణ్‌ను డామినేట్ చేశానని కూడా చిరు పేర్కొన్నారు. అటు రామ్‌చరణ్ సైతం ఈ సాంగ్ నాకు జీవితంలో ఎప్పటకీ గుర్తుండిపోతుందని.. మా నాన్న నా ఆచార్య చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ చేయడం.. తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.. ఇది మాటల్లో చెప్పలేనని చిరు తనయుడు చరణ్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.
సినిమాలో తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసే సాంగ్ ఇదే. ఈ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రచించగా.. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సీనియర్ గాయకుడు శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లింగజ్ కలిసి ఈ పాట పాడారు. ఇక ఆచార్య నుంచి ఇప్పటికే వచ్చిన లాహే లాహే – నీలాంబరి – సానా కష్టం సాంగ్స్ అదిరిపోయాయి. ఏదేమైనా సినిమాకు పాటలు పెద్ద ఎస్సెట్ కానున్నాయి. మరి ఆచార్య ఏం చేస్తుందో ఈ నెల 29న తేలిపోనుంది.