అతిలోక సుందరి శ్రీదేవి ఆ తరం జనరేషన్ అభిమానులకు ఆరాధ్య దేవత. 1970వ దశకంలో 16 ఏళ్లప్రాయంలోనే సినిమా హీరోయిన్ అయిన ఆమె 1992-94 వరకు సౌత్ సినిమాను ఏలేసింది. ఓ 20 ఏళ్ల పాటు శ్రీదేవి ఓ అతిలోక సుందరి.. ప్రేక్షకుల ఆరాధ్య దేవత. ఆమెతో సినిమాల్లో నటించేందుకు ఎంతో మంది హీరోలు ఆసక్తితో ఎదురు చూసేవారు. సూపర్‌స్టార్ కృష్ణ లాంటి వాళ్లే ముందు ఆమె డేట్లను బ్లాక్ చేసి పెట్టమని నిర్మాతలకు చెప్పేవారు. శ్రీదేవి సినిమాలో ఉందంటే అటు పక్క ఎంత పెద్ద హీరో ఉన్నా సినిమాకు శ్రీదేవితోనే క్రేజ్ ఉండేది. శ్రీదేవిని చూసేందుకు ప్రేక్షకులు హీరోతో సంబంధం లేకుండా వచ్చేవారు.
నాటి తరం మేటి హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ ఇలా అందరి హీరోలతోనూ శ్రీదేవి సినిమాలు చేసింది. ఆ తర్వాత తరం హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్‌తో కూడా శ్రీదేవి సినిమాలు చేసి హిట్లు కొట్టింది. అలా రెండు జనరేషన్ హీరోలతో జోడీ కట్టిన శ్రీదేవి.. తండ్రి, కొడుకుల పక్కన కూడా యాక్ట్ చేసింది. ఏఎన్నార్‌తోనూ, ఇటు నాగార్జునతోనూ ఆమె నటించి… ఇద్దరికి హిట్లు ఇచ్చింది. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ జనరేషన్ తర్వాత చిరంజీవి, నాగ్, వెంకీ, బాలయ్య జనరేషన్లో బాలయ్యతో తప్పా ఆమె అందరితోనూ నటించింది.
బాలయ్యతో శ్రీదేవికి నటించే ఛాన్స్ రెండు సార్లు వచ్చింది. రెండు సార్లు వీరి కాంబినేషన్ సెట్ చేసినా కూడా అది సెట్ కాలేదు. అయితే దీనికి చాలా కారణాలే ఉన్నాయంటారు. ఆ కారణాల కంటే ముందు బాలయ్య – శ్రీదేవి కాంబినేషన్ సెట్ అయ్యేందుకు ప్లాన్ చేసిన సందర్భాలు చూస్తే 1987లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు బాలయ్య – శ్రీదేవి కాంబినేషన్లో సామ్రాట్ సినిమా ప్లాన్ చేశారు. అప్పుడు ఎన్టీఆరే స్వయంగా ఈ కాంబినేషన్‌పై ఆసక్తి చూపకపోవడంతో క్యాన్సిల్ అయ్యిందంటారు.
ఆ తర్వాత 1989లో మరో స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి సైతం భలేదొంగ సినిమాలో బాలయ్య పక్కన శ్రీదేవిని నటింపజేస్తే ఎలా ? ఉంటుందా ? అని ప్లాన్ చేశారు. కోదండ రామిరెడ్డి శ్రీదేవిని డైరెక్ట్ చేశారు. శ్రీదేవితో ఆయనకు మంచి చనువు ఉంది. ఆమె బాలీవుడ్ వెళ్లి అక్కడ హిట్లు కొట్టి స్డార్ డమ్ తెచ్చుకున్నారు. దీంతో కోదండ రామిరెడ్డిని ఆమె స్వయంగా మీరు బాలీవుడ్‌కు రండి అని చాలా సార్లు ఇన్వైట్ చేశారు. అయితే ఆయనకు హిందీ రాకపోవడంతో అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఒక్క సినిమా చేసినా అది ప్లాప్ కావడంతో ఆయన అటు వైపే తొంగి చూడలేదు.
ఈ చనువుతోనే బాలయ్యతో శ్రీదేవి కాంబినేషన్ సెట్ చేయాలని భలేదొంగ సినిమా అప్పుడు ఆయన అనుకున్నారు. అప్పుడు కూడా ఎన్టీఆర్‌తో పాటు కొందరు నందమూరి అభిమానులు తండ్రి పక్కన చేసిన శ్రీదేవిని బాలయ్య పక్కన హీరోయిన్‌గా వద్దని రిక్వెస్ట్ చేయడంతో అప్పుడు శ్రీదేవి ప్లేసులో విజయశాంతిని తీసుకున్నారు. అలా రెండు సార్లు కూడా బాలయ్య పక్కన శ్రీదేవిని హీరోయిన్‌గా అనుకున్నా ఆ కాంబినేషన్ సెట్ కాలేదు.