టాలీవుడ్‌లో బోయపాటి శ్రీను, కొరటాల శివ ఇద్దరూ కూడా టాప్ డైరెక్టర్లే. వినయ విధేయరామ లాంటి సినిమా వదిలేస్తే అటు బోయపాటి, ఇటు కొరటాల కెరీర్‌లో అన్ని సూపర్ హిట్లే. కొరటాల చేసిన నాలుగు సినిమాలు బంపర్‌హిట్లే. తాజాగా కొరటాల డైరెక్ట్ చేసిన ఆచార్య ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోంది. అటు బోయపాటికి భద్రతో మొదలు పెడితే రీసెంట్‌గా అఖండ వరకు అన్ని సూపర్ హిట్లే. పైగా ఒక్క బాలయ్యతోనే బోయపాటి మూడు బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చాడు.
వీరిద్దరు కూడా పోసాని కృష్ణమురళీకి బంధువులే.. ఇద్దరూ పోసాని దగ్గరే శిష్యరికం చేశారు. పోసానే ముత్యాల సుబ్బయ్య దగ్గర బోయపాటిని అసిస్టెంట్‌గా చేర్పించారు. అయితే బోయపాటి కంటే కొరటాలే పోసానికి మరింత దగ్గర. వీరిద్దరు మేనమామ.. మేనత్త కొడుకులే అవుతారు. బోయపాటి కాస్త దూరం. కట్ చేస్తే వీరిద్దరిలో ముందుగా బోయపాటి శ్రీను భద్ర సినిమాతో డైరెక్టర్గా మారాడు. వరుసగా భద్ర – తులసి – సింహా – దమ్ము – లెజెండ్ – సరైనోడు – జయ జానకీ నాయక – అఖండ లాంటి హిట్లతో దూసుకు పోయారు. మాస్ హీరోగా ఎవరు ఎలివేట్ కావాలన్నా బోయపాటి చేతిలో పడాల్సిందే అన్నంత క్రేజ్ బోయపాటికి వచ్చేసింది.
ఇక కొరటాల కూడా మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్లు కొట్టాడు. కొరటాలది కూడా మామూలు క్రేజ్ కాదు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో కొరటాల బోయపాటి దగ్గర కొన్ని సినిమాలకు పనిచేశారు. బాలయ్యతో బోయపాటి తీసిన సింహా సినిమా ఇద్దరి మధ్య గ్యాప్‌నకు కారణమైంది. ఈ సినిమా కథ, కథన విస్తరణలో తాను కీలకంగా ఉన్నానని.. అయితే తన పేరు వేయలేదని కొరటాల ఆవేదన.
అయితే కొరటాల ఈ విషయాన్ని శ్రీమంతుడు సక్సెస్ తర్వాత బయట పెట్టారు. దీనికి బోయపాటి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆ సినిమాకు కొరటాలతో పాటు చాలా మంది పనిచేశారని.. ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇచ్చారని… ఆ సలహాలు తీసుకుని తాను సింహా సినిమా కథను డెవలప్ చేసుకున్నానని.. ఆ క్రెడిట్ అందరికి ఉంటుందే తప్పా కొరటాలకు ప్రత్యేకంగా ఉండదన్నారు. ఒకటి, రెండు సీన్లు చెప్పినా వారి పేర్లు వేయాలంటే.. చాలా మంది పేర్లు వేయాల్సి ఉంటుందని బోయపాటి అన్నారు.
అయితే కొరటాల వెర్షన్ మరోలా ఉంది. తనకు సింహా సినిమా విషయంలో జరిగిన అన్యాయంతో ఎంతో డీలా పడ్డానని.. అయితే ఇదో గుణపాఠంగా తీసుకుని.. తాను మరింత త్వరగా పైకి రావాలని కసితో కష్టపడ్డానని… మనం నమ్మి మోసపోవడం మన తప్పే అని చెప్పారు. ఆ తర్వాత పోసాని కూడా బోయపాటిని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు. కారణాలు ఏవైనా కావచ్చు.. పోసాని రాజకీయంగా కూడా బాలయ్యపై కొన్ని సార్లు నోరుపారేసుకున్నాడు. బోయపాటి .. ఇప్పుడు బాలయ్యకు, నందమూరి అభిమానులకు దగ్గరగా ఉన్నాడు. ఇలా చాలా కారాణాలు బోయపాటి వర్సెస్ కొరటాల, పోసాని మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణాలుగా మారాయి.