కరోనా సెకండ్ వేవ్ తర్వాత అసలు థియేటర్లలోకి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయాలా ? వద్దా ? అన్న సందేహాలు ఉన్న టైంలో బాలయ్య డేర్ చేసి అఖండను థియేటర్లలోకి వదిలేశాడు. పైగా అప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. అవేమి పట్టించుకోకుండానే అఖండ వచ్చింది. రు. 58 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఓవరాల్‌గా రు. 200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఏపీ, సీడెడ్, నైజాం, ఓవర్సీస్ అన్ని ఏరియాల్లోనూ సినిమా కొన్న వారికి భారీ లాభాలే వచ్చాయి.
అఖండ ఇచ్చిన ధైర్యంతోనే ఆ తర్వాత పుష్ప, భీమ్లానాయక్, బంగార్రాజు, రాధేశ్యామ్ .. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఇలా వరుసగా పెద్ద సినిమాలు వస్తున్నాయి. అఖండ తర్వాత చాలా పెద్ద సినిమాలు వచ్చాయి. కోట్లాది వసూళ్లు కుమ్మేశాం అని చెప్పుకుంటున్నాయి. మరి వాస్తవంగా ఏ సినిమా పెద్ద హిట్ అంటే అఖండే అని డిస్ట్రిబ్యూటర్లు ఘంటాపథంగా చెపుతున్నారు. అందుకు వారు చెపుతోన్న లెక్కలే పెద్ద ఫ్రూప్‌గా ఉంటున్నాయి.
ఉదాహరణకు గోదావరి జిల్లాల్లో ఓ థియేటర్లో ( ఇది సీ సెంటర్) అఖండ నుంచి స్టార్ట్ అయ్యి పుష్ప, బంగార్రాజు, రాధేశ్యామ్, భీమ్లానాయక్, త్రిబుల్ ఆర్ అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అఖండ సినిమాను రు. 2.50 లక్షలకు కొన్నారు.ఈ సినిమా రెండు వారాల్లోనే రు. 6.50 లక్షలు రాబట్టింది. అంటే నాలుగున్నర లక్షలు లాభం వచ్చింది. పుష్ప సినిమాను రు. 5 లక్షలకు కొంటే బ్రేక్ ఈవెన్‌తో బయట పడ్డారు. సంక్రాంతికి వచ్చిన బంగార్రాజును తక్కువ రేటుకే కొన్నా స్వల్ప నష్టంతో బయట పడ్డారు.
ఇక పవన్ భీమ్లానాయక్ సినిమాను కూడా రు. 5 లక్షలకే కొన్నారు. భీమ్లానాయక్‌కు రు. లక్ష నష్టం వచ్చింది. ప్రభాస్ రాధేశ్యామ్ రిజల్ట్‌పై వీళ్లకు ముందే డౌట్ పట్టుకుంది. కొనాలా వద్దా.. అన్న సందేహాల మధ్యే ఈ సినిమాను రు. 5 లక్షలకు తీసుకున్నారు. రు. 2 లక్షలు నష్టం. ఇక త్రిబుల్ ఆర్ సినిమాను రు. 16 లక్షలు చెప్పడంతో చివరి వరకు సినిమాను వేయాలా ? వద్దా ? అని సందిగ్ధంలోనే పడ్డారు.
పెద్ద సినిమా.. రాజమౌళి – ఎన్టీఆర్ – చరన్ జాక్‌పాట్ తగులుతుందేమో..మరో బాహుబలి అవుతుందేమో అనుకన్నారు. పైగా థియేటర్లో సినిమా వేయకపోతే అదో పరువు సమస్య… చివరకు రు. 14 లక్షల డీల్‌తో సినిమాను తీసుకువచ్చారు. కట్ చేస్తే లక్షన్నర నష్టంతో భయటపడుతున్నామని చెప్పారు. కలెక్షన్ కూడా రోజుకు రు. 10 వేలకు పడిపోయిందని… వరుణ్ తేజ్ గని సినిమా తేవాలని అనుకుంటున్నామని చెప్పారు. మధ్యలో రవితేజ ఖిలాడీ కూడా పెద్ద బొక్క పెట్టిందని ఈ సినిమాను రు 1.25 లక్షలకు కొంటే కేవలం రు. 37 వేలు మాత్రమే వచ్చాయని చెప్పారు.
గని సినిమాను కూడా రు. 2 లక్షలు చెపుతున్నారని.. కరోనా లాక్‌డౌన్ తర్వాత యేడాదిన్నర పాటు థియేటర్లు తెరవలేదని.. ఏదో థియేటర్లను నడపాలని తాము పంతంతో ఉన్నామని.. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఎంత చెపితే అంతకే సినిమాను తీసుకు రావాల్సి వస్తోందని వాపోతున్నారు. బాలయ్య అఖండ సినిమా లేకపోయి ఉంటే ఈ పాటికే తాము థియేటర్‌ను మూసుకోవడమో లేదా.. వేరే వాళ్లకు వదిలేసుకోవాల్సి రావడమో జరిగేదని చెపుతున్నారు. ఈ లెక్కలన్ని చూస్తే బాలయ్య అఖండ మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్ అయినట్టు లేదూ..!