త్రిబుల్ ఆర్ ప్రచారం పీక్స్‌లో ఉన్న వేళ ఇప్పుడు రాజమౌళి నోటి నుంచి బాహుబలి 3 మాట వచ్చింది. నిజానికి ఇప్పుడు ఈ ప్రచారం మొదలైతే త్రిబుల్ ఆర్ ప్రచారం సైడ్ అవుతుంది. దీనిపై చర్చ రాజమౌళీకే కాదు.. ఎవరికి అయినా అనవసరమే..! త్రిబుల్ ఆర్ రిలీజ్ అవ్వాలి.. దాని స్టామినా ఏ రేంజ్‌లో ఉంటుందో లెక్కలు తేలాలి.. ఆ తర్వాత మహేష్‌బాబు – రాజమౌళి సినిమా.. దీనికి ఎలా లేదన్నా మరో రెండేళ్లు టైం పడుతుంది. ఆ తర్వాత బాహుబలి 3 చర్చ ఉంటుంది. రాజమౌళి గతంలోనూ బాహుబలి 3 తీసేందుకు తమ నిర్మాత ఆసక్తిగా ఉన్నారని.. ఆ సినిమా ఖచ్చితంగా ఉంటుందనే చెప్పారు. కానీ ఈ సినిమా కల ఇప్పట్లో తీరుతుందా ? అది సాధ్యమయ్యే పనేనా ? అంటే చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాల నడుమ బాహుబలి 3 ఉండకపోయే ఛాన్సులే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి బాహుబలి ది కంక్లూజన్ కాస్త పొడిగించినట్టే ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌తోనే దీనిని ముగించాలని ముందుగా అనుకున్నారు. ఎప్పుడు అయితే సినిమా నిడివి 4 గంటలు దాటేసిందో.. తర్వాత మార్కెట్ స్ట్రాటజీతో దీనిని రెండు పార్టులుగా విడదీశారు. ఇప్పుడు వచ్చిన పుష్ప కూడా అంతే. రేపు రాబోయే సలార్ రెండు పార్టులు అదే గిమ్మిక్కులతో చేస్తోన్న ప్రయత్నాలు.
ఒక్కసారి బాహుబలి పట్టాభిషేకం జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్త కథను ఎలా పుట్టిస్తారు ? అన్నది పెద్ద ఫజిల్. పైగా శత్రువులు చనిపోయారు. ఒకవేళ బాహుబలి 3 ఖచ్చితంగా తీయాలని రాజమౌళి ఫిక్స్ అయితే తమన్నా రాణిగా ఉండాలి. ఆమెను ఇప్పటికే జనాలు మర్చిపోతున్నారు. ఏదో చిరంజీవి లాంటి సీనియర్ హీరోలకు మాత్రమే కాస్తో కూస్తో ఆప్షన్‌గా ఉంది. తమన్నాను పెడితే ప్రేక్షకులకు కిక్ ఉండదు.. ఆమే సినిమాకు మైనస్ అయినా అవ్వొచ్చు.
తొలి రెండు పార్టుల విజయంలో అనుష్కది కూడా ప్రధాన రోల్. ఇప్పటికే అనుష్క ఫేడవుట్ అయ్యి ఛాన్సుల కోసం ముప్పుతిప్పలు పడుతోంది. ఆమెను మళ్లీ ఎలా కొనసాగిస్తారు ? ఒకవేళ కంటిన్యూ చేయాలని అనుకుంటే అమ్మ పాత్రతో సరిపెట్టాలి. పైగా ఆమెకు మార్కెటింగ్ చార్మ్ లేదు. ఒకవేళ అనుష్కను కంటిన్యూ చేసినా.. ప్రభాస్ పక్కన మరో పాత్రను క్రియేట్ చేయాలి.. అప్పుడు తమన్నా యువరాణి పాత్ర ఉదాత్తదే పోయినట్లవుతుంది.
ఇక బాహుబలి 1,2 సినిమాల్లో బలమైన విలన్ రానా. భల్లాలదేవుడిగా ఎంత క్రూరంగా కనిపించాడో చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు ఆ పాత్ర చచ్చిపోయింది. ఇప్పుడు అంత పవర్ ఫుల్ విలన్ రోల్ మరొకటి క్రియేట్ చేయాలి.. ఆ పాత్రకు ప్రభాస్‌కు వైరం క్రియేట్ చేయాలి.. అందుకు తగ్గ హీరో కావాలి… అన్నింటికి మించి బాహుబలికే నాలుగైదేళ్లు టైం కేటాయించిన ప్రభాస్.. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్‌కు మరో ఆరేళ్లు కేటాయించి అలసిపోయి ఉన్నాడు.
మరి ఇప్పుడు ఎంత రాజమౌళి సినిమా అయినా మరో మూడేళ్లు ఇవ్వడానికి సిద్ధపడకపోవచ్చు. ఇక బాహుబలి రేంజ్‌లో బాహుబలి 3 కథ రాయడం వయస్సు మీద పడుతోన్న విజయేంద్ర ప్రసాద్‌కు సాధ్యం కాకపోవచ్చు. ఇన్ని సందేహాల నడుమ బాహుబలి 3 రావడం అసాధ్యమే. మరో ట్విస్ట్ రాజమౌళి తనకు ఇష్టమైన మహాభారతకం కథ కూడా రెడీ చేయిస్తున్నాడు. బాహుబలి 3 కంటే ముందు అదే సెట్స్ మీదకు వెళ్లినా వెళ్లొచ్చు.