సినీ రంగంలో అన్నగారి స్టయిలే వేరు. ఆయన ఏం చేసినా..పెద్దసీన్ క్రియేట్ అవుతుంది. ఆయనను కాదనే వారు.. ఇండస్ట్రీలో ఎవరూ లేరు. ఉన్నా.. ఎవరూ మాట్లాడరు. అది 1977-78 మధ్య కాలం.. అప్పట్లో అన్నగారు మంచి ఊపు మీద దూసుకుపోతున్నారు. ఆయన ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అవుతూ వస్తోంది. అప్పటికే పౌరాణిక, జానపద, సాంఘీక సినిమాల్లో నటిస్తూ హిట్లు మీద హిట్లు కొడుతున్నారు.ఈ సమయంలో ఆయనతో సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు క్యూ కట్టేవారు. ఈ సమయంలో దర్శకుడు రాఘవేంద్ర రావు.. అన్నగారితో మూవీ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే `వేటగాడు!` ఈ సినిమా స్టోరీ అందరికీ తెలిసిందే.
అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? అనే విషయం చాలా రోజులు తేలలేదు. దర్శకుడు రాఘవేంద్ర రావు మాత్రం శ్రీదేవిని పెట్టాలని పట్టుబడుతున్నారు. నిర్మాతలు (ఈ సినిమాను ఇద్దరు నిర్మించారు) మాత్రం వద్దంటున్నారు. “అన్నగారి పక్కన శ్రీదేవి అంటే.. జనాలు నవ్విపోతారు!“ అని నిర్మాతలు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. రాఘవేంద్రరావు మాత్రం పట్టుబట్టి మరీ శ్రీదేవిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. అటు శ్రీదేవి కూడా అన్నగారి పక్కన నటించేందుకు సిద్ధంగా లేదని స్పష్టం అయింది.
దీంతో రాఘవేంద్రరావు తర్జన భర్జన పడుతున్న సమయంలో అన్నగారికి విషయం తెలిసింది. దీంతో ఆయన నిర్మాతలను పిలిచి.. విషయం ఏంటని చర్చించారు. దీంతో విషయం చెప్పారు. దీనికి కారణం కూడా చెప్పారు. “ఐదేళ్ల కిందట మీ పక్కన మనవరాలిగా నటించింది. ఇప్పుడు హీరోయిన్ అంటే.. జనాలు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకే శ్రీదేవిని వద్దంటున్నాం!“ అని నిర్మాతలు తేల్చి చెప్పారు. అంటే.. 1972లో వచ్చిన బడిపంతులు మూవీలో శ్రీదేవి ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించింది.
దీనికి అన్నగారు.. ఆసక్తికర కామెంట్లు చేశారు. “సినిమాల్లో నటించేవారికి సెంటిమెంట్లు చూడొద్దు. ప్రేక్ష కులు దేవుళ్లు. వాళ్లు అన్నీరిసీవ్ చేసుకుంటారు. మీకెందుకు బాధ. నాదీ బాధ్యత. మీకు ఫ్రీ పబ్లిసిటీ కూడా చేసి పెడతా!!“ అని హామీ ఇచ్చారట. సినిమాలో కథా బలం ఉండాలే కాని.. ప్రేక్షకులు ఇవేవి పట్టించుకోరని కూడా ఎన్టీఆర్ చెప్పారట.
అంతేకాదు.. శ్రీదేవిని సైతం అన్నగారే ఒప్పించారట. కట్ చేస్తే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ – శ్రీదేవిని పక్క పక్కన చూస్తే వారిద్దరి జోడీ చాలా ముచ్చటగా ఉందని ప్రతి ఒక్కరు అనుకున్నారట.
తర్వాత.. ఈ మూవీ ఏరేంజ్‌లో సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈ మూవీ తర్వాత.. వరుసగా శ్రీదేవి-అన్నగారి కాంబినేషన్‌లో అనేక అదిరిపోయే మూవీలు వచ్చాయి.