Moviesఒక‌ప్పుడు క్రేజీ హీరో వడ్డే నవీన్ ఎక్కడ ఉన్నాడు... ఎందుకు సినిమా...

ఒక‌ప్పుడు క్రేజీ హీరో వడ్డే నవీన్ ఎక్కడ ఉన్నాడు… ఎందుకు సినిమా పరిశ్రమనుంచి దూరం అయ్యాడు ?

సినీ పరిశ్రమలో రాణించాలంటే గుమ్మడి కాయంత టాలెంట్ ఉంటే సరిపోదు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది కొంత మంది సినీ ప్రముఖుల జీవితాల్లో నిజమైంది కూడా. అందులో ఒకరే హీరో వడ్డే నవీన్.. 30కి పైగా సినిమాల్లో హీరోగా నటించినటువంటి వడ్డే నవీన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. అసలు మీడియా ముందు కూడా రావట్లేదు.. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “కోరుకున్న ప్రియుడు” సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆయన మొదటి సినిమాతోనే మంచి నటుడుగా పేరు కూడా సంపాదించారు. నవీన్ నటించిన మొదటి చిత్రం మంచి విజయం సాధించింది. దాంతో నవీన్ కి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. మనసిచ్చి చూడు, స్నేహితులు, ప్రేమించే మనసు, పెళ్లి, మా బాలాజీ, బాగున్నారా, నా ఉపిరి ఇలా దాదాపుగా 30 సినిమాలలో హీరోగా నటించాడు.

అయితే నవీన్ కెరియర్లో నటించిన అన్ని సినిమాల్లో ఎక్కువగా ఫ్లాప్స్ ఉండడం వల్ల‌ చూస్తుండగానే నవీన్ తెరపైన కనుమరుగయ్యారు. ఆ త‌ర్వాత సంగీత‌ను హీరోయిన్‌గా పెట్టి నా ఊపిరి సినిమా చేశాడు. అది మంచి సినిమాయే. అయితే అప్ప‌టికే న‌వీన్ ఫేడ‌వుట్ అయిపోవ‌డంతో జ‌నాలు ప‌ట్టించుకోలేదు. నవీన్ చివరగా నటించిన చిత్రం ఎటాక్ అనే సినిమా… ఈ సినిమాని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఇక నవీన్ సినిమాలకు దూరమైపోయారు.

ఇక ఇటువలే ప్రముఖ పీఆర్వోలలో ఒకరైన వినాయకరావు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఇస్తూ.. వడ్డే నవీన్ గురించి, ఇతర విషయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు వీక్లీ పేపర్లకు బాగా ప్రాధాన్యత ఉండేదని… ఒక సినిమా గురించి ప్రజలకు తెలియాలంటే సినిమా జర్నలిస్టుల ద్వారానే తెలిసేదని… ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా బాగా అభివృద్ధి చెందడం వల్ల‌ ఇప్పుడు వీక్లీ పేపర్స్ ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

అంతేకాదు తాను గతంలో శ్రీకాంత్, కృష్ణంరాజు, వడ్డే నవీన్ లకు పీఆర్వోగా పని చేశానని… నవీన్‌కి కెరియర్ మొదట్లో వరసగా హిట్స్ వచ్చాయని… ఆ తర్వాత పెరిగిన కాంపిటీషన్ కారణంగా నవీన్ వెనక‌పడ్డారని వినాయకరావు అన్నారు. సరైన టైం లో వడ్డే నవీన్ కు సరైన సినిమాలు పడలేదని కానీ … నవీన్ మంచి సినిమాలు చేశారని వినాయకరావు చెప్పుకొచ్చారు. ఆయన చేసిన సినిమాలు ఎక్కువ సక్సెస్ సాధించకపోవడంతో ఆయన సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందంటూ వినాయకరావు అన్నారు.

2001 తర్వాత నవీన్ చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. దానితో ఇక సినిమాలు తీయడం ఆపేసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కనీసం టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బిజినెస్ పనులను చూసుకుంటున్నాడు. కానీ నవీన్ మంచి నటుడు… ఒకప్పుటి హీరోలందరూ కూడా ఇప్పుడు మంచి మంచి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు… ఆ కోవలోనే న‌వీన్ కూడా వెండితెర‌పై రీ ఎంట్రీ ఇస్తాడేమో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news