తెలుగు చిత్ర సీమలో అన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఎన్టీఆర్ కు ప్రత్యేక చరిత్ర ఉంది. ఆయనది సినీ చరిత్రలో ఇమిడిపోయే అధ్యాయం కాదు. ప్రత్యేక చరిత్రే!! ఆయన చేసిన అనేక సినిమాల్లో ఆయన పాత్రకు భిన్నమైన అభినివేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన వాక్చాతుర్యం.. తెలుగు పదాలు పలికే తీరు.. వంటివి ఆయనకు ప్రత్యేక వేదికను సుస్థిరం చేశాయి. ఇక, అన్నగారు ఏ చిత్రంలో నటించినా.. చాలా హుషారుగా ఉంటారు. యూనిట్ అందరిలోకీ ముందే.. షూటింగ్ స్పాట్‌కు చేరుకోవడం.. అందరికన్నా ముందుగానే పాత్రకు ప్రిపేర్ అయిపోవడం.. వంటివి అన్నగారికి మాత్రమే పరిమితమైన స్పెషల్స్.
అంతేకాదు.. అన్నగారు షూటింగ్‌లో ఉన్నారంటే.. ఒక సింహం ఉన్నట్టే లెక్క..! ఆయన డిసిప్లిన్.. అంతా ఇంతా కాదు. నిర్మాత అంటే.. ఎనలేని గౌరవం. `ఆయన వల్లే మనం బతుకుతున్నాం` అని ఏమాత్రం భేషజాలకు పోకుండా చెప్పేవారు. ఇక, షూటింగుల సమయంలో ఇంట్లో సమస్యలను అక్కడ ప్రస్తావించేవారు. ఎవరైనా ప్రస్తావించినా.. ఆయన వద్దని వారించేవారు. అసలు ఆయన ముందు నోరు విప్పడానికి ఎవరు సాహసిస్తారు కనుక! కానీ.. కొందరు మాత్రం(అప్పట్లో ఎన్టీఆర్ సమకాలికులు) సమస్యలను చెప్పుకొనేవారు. కొందరు అన్నగారితో పిచ్చాపాటీ కూడా మాట్లాడేవారు. ఇలాంటి సందర్భాల్లోనూ అన్నగారు చాలా ఆనందంగా కనిపించేవారు.
అయితే.. ఒక సినిమా విషయంలో షూటింగ్ సందర్భంలో ఆయన చెవిలో పడిన వార్త.. అన్నగారిని తీవ్రంగా కలచి వేసింది. దీంతో ఆయన వెంటనే షూటింగ్ ఆపేసి.. హైదరాబాద్ శివారులోని గండికోట వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయి.. మూడు రోజుల వరకు బయటకు రాలేదట..! ఇది నిజం. మరి ఇంతగా అన్నగారిని కుదిపేసిన ఘటన ఏంటి? ఎందుకు ? అనేది ఆసక్తికరం. విషయంలోకి వెళ్తే.. అన్నగారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అనేక సినిమాలు తీశారు. తర్వాత.. ఆయన నిర్మాతగా కూడా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయన `సామ్రాట్ అశోక` చిత్రాన్ని నిర్మించారు. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా.
అశోకుడి జీవిత చరిత్ర ఆధారంగా అన్నగారే నిర్మాత, దర్శకుడిగా మారి తీసిన సినిమా. ఈ సినిమా ఎక్కువ షూటింగ్ అంతా హైదరాబాద్‌లోని సొంత స్టూడియో రామకృష్ణా స్టూడియోస్‌లోనే అన్నగారు తీశారు. ఈ చిత్రంలో అన్నగారే హీరో (అశోకుడి పాత్ర), ఇక, హీరోయిన్ మాత్రం అప్పుడప్పుడే ఎదుగుతున్న వాణీ విశ్వనాధ్. అది కూడా అప్పట్లో బాపూ సూచనల మేరకు ఆమెను హీరోయిన్‌గా అన్నగారు తీసుకున్నారు. షూటింగ్ దాదాపు సగం పూర్తయిపోయింది. కీలకమైన ఘట్టాలను ముఖ్యంగా పాటలను చిత్రీకరిస్తున్నారు. అన్నగారికి ఇదో స్టయిల్. సాధారణంగా చిత్రంలో పాటలు మధ్యలో చిత్రీకరించేవారు.
కానీ, అన్నగారు మాత్రం సినిమా చివరిలో కానీ.. ముందుగాని పాటలు చిత్రీకరించేవారు. సినిమా మొత్తం చేసిన తర్వాత.. పాటలు చేయడం అంటే అప్పటికి ఎస్సెన్స్(ఓపిక) తగ్గిపోతుందనే భావన ఆయనలో ఉండేదట. ఈ క్రమంలోనే చివరలో పాటలు చిత్రీకరిస్తున్నారు. అయితే.. సడెన్‌గా ఒకరోజు.. వాణీ విశ్వనాథ్ చెప్పకుండా చేయకుండా.. షూటింగ్‌ను ఎగ్గొట్టేశారు. ఎంత సేపు వేచి చూసినా.. ఆమె రాలేదు.ఇప్పట్లో మాదిరిగా అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. ల్యాండ్ లైన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తే.. “మేడం హైదరాబాద్ వచ్చేశారు“ అని సమాధానం. కానీ, గంటలు గడిచినా ఆమె రాలేదు.
ఇంతలో బాపు గారి అసిస్టెంట్ ఒకాయన రామకృష్ణా స్టూడియోస్ కు వచ్చి.. ఎన్టీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వార్తను ఆయన చెవిలో వేశారు. “ఈ విషయంలో ఆమె తీవ్రంగా మధన పడుతోంది. అందుకే రాలేదు. ప్రస్తుతం బాపు గారి ఇంట్లో ఉందట“ అని చెప్పారు. దీంతో అన్నగారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే షూటింగ్ ఆపేసి.. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. కట్ చేస్తే.. మూడు రోజుల తర్వాత.. బాపు స్వయంగా వాణీ విశ్వనాథ్‌ను తీసుకుని అన్నగారిని కలిసేందుకు వచ్చారు. అప్పుడు వాణీ విశ్వనాథ్ బోరున ఏడ్చేసిందట. ఆమెను భుజం తట్టి ఓదార్చిన అన్నగారు.. “అదంతా పుకారే.. నీకు ఎలాంటి ఇబ్బందీ లేదు. గార్దభాలు కూడా ఈ మధ్య మొరుగుతున్నాయి“ అని అన్నారట.
దీంతో కథ సుఖాంతం అయిపోయి.. వాణీ విశ్వనాథ్ తన షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నట్టుగానే అప్పట్లో సినీ పత్రికలు ఎక్కువగా ఉండేవి. ఓ పత్రికలో “అన్నగారు వాణీ విశ్వనాథ్‌ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఆమెను సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకున్నారు. సినిమా అయిపోగానే వివాహం ఖాయం“ అని పెద్ద వార్త వచ్చింది. ఇది అన్నగారి కంటే ముందు (అసలు అన్నగారికి ఇలాంటి చెప్పే దమ్ము ఎవరికి ఉంది?) వాణీ విశ్వనాథ్‌కు చేరిపోవడంతో లబోదిబోమంటూ.. ఆమె బాపూ ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నారట.
అయితే.. “పత్రిక వారికి ఏదో ఒక గ్యాసిప్ కావాలి.. కదా.. అందుకే రాసి ఉంటారని.. దీనివల్ల సినిమా కంటే ముందే..నువ్వు బాగా పాపులర్ అయ్యావులే.. ఎన్టీఆర్ అలాంటివాడు కాదు!“ అని బాపు వాణీ విశ్వనాథ్‌కు నచ్చజప్పారట!! ఇదీ సంగతి!! గత 2019 ఎన్నికలకు ముందు కూడా ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన విషయం.. రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందేకదా.. దీనివెనుక ఉన్న అన్నగారి అంతరంగం ఇది. తర్వాత ఆయన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.