తెలుగు సినిమా పరిశ్రమలో దివంగత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు హరికృష్ణ. 1980వ టైంలో తండ్రి సినిమాల్లో పౌరాణిక పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో హరికృష్ణ పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత హిందూపురం ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు కొంత కాలం పాటు రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కూడా ఆ వయస్సులో సూపర్ సక్సెస్‌లు కొట్టాడు.
లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, శివరామరాజు ఇలా ఎన్నో సినిమాలు హరికృష్ణకు మంచి హిట్ ఇచ్చాయి. ఒకేసారి అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు కళ్యాణ్‌రామ్ సినిమాలు.. ఇటు తన సినిమాలు రావడంతో అప్పట్లో హరికృష్ణ ఆనందం కెరీర్‌లోనే చాలా పీక్ స్టేజ్‌లో ఉండేది. ఇద్దరు కొడుకులు హీరోలు.. ఎన్టీఆర్‌కు ఆది, సింహాద్రితో తిరుగులేని బ్లాక్‌బస్టర్.. ఇటు కళ్యాణ్‌రామ్ హీరోగానే కాకుండా.. నిర్మాతగా కూడా సక్సెస్ అవ్వడంతో హరికృష్ణ ఎంతో ఆనందపడేవారు.
ఇక ఎన్టీఆర్‌తో పాటు హరికృష్ణ సినిమాల్లో నటిస్తున్నప్పుడే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన నాటి సమైక్య రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. చైతన్య రథం అనే జీప్‌తో ఎన్టీఆర్ ఎక్కడికక్కడ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. ఈ చైతన్య రథానికి హరికృష్ణ డ్రైవర్‌గా ఉండేవారు. ప్రతి రోజు పగలు అంతా తన తండ్రిని నడిపించే రథ రక్షకుడిగా పనిచేస్తే రాత్రి అవ్వగానే ఆ చైతన్య రథం ( జీప్)కు నట్లు బిగించుకోవడం, లైట్లు సరిచేసుకోవడం.. ఈ పనులతోనే హరికృష్ణ బిజీగా ఉండేవారు. పైగా ఎక్కడ పడితే అక్కడే పడుకునే వాడు.
తండ్రి అధికారంలోకి వచ్చేవరకు చైతన్య రథం నడుపుతూ తండ్రికి తోడుగా, అంగరక్షకుడిగానే ఉన్నారు. ఇక హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణంతో అందరిని దుంఖఃలో ముంచేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా తండ్రి సెంటిమెంట్‌తోనే తెరకెక్కింది. ఈ ఫంక్షన్‌కు కూడా హరికృష్ణ వచ్చి తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఓ సారి ఎన్టీఆర్ ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తూ హరికృష్ణకు ఫోన్ చేశారట.
రేపు ఉదయం నేను ఆంధ్రప్రదేశ్‌లో దిగుతాను.. నేను వచ్చే సరికే నువ్వు చైతన్య రథంతో రెడీగా ఉండాలని చెప్పారట. ఎన్టీఆర్ హరికృష్ణకు ఫోన్ చేసే సరికే రాత్రి అయ్యిందట. తండ్రి ఫోన్ వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి 900 కిలోమీటర్లు జర్నీ చేసి మరీ హరికృష్ణ ఉత్తరాంధ్రకు వచ్చేశారట. తండ్రి ఫోన్ చేసిన వెంటనే బయలు దేరి 900 కిలోమీటర్లు ఏకబిగినీ జర్నీ చేసి ఉదయం అయ్యే సరికే తండ్రికి స్వాగతం పలికారట హరి. ఏదేమైనా అనుబంధాల విషయంలో హరికృష్ణ ఎంతో అప్యాయంగా ఉంటారు. సీతారామరాజు సినిమాలో తనతో నటించిన హరికృష్ణను మాత్రమే తాను అన్నయ్యా అని పిలుస్తానని.. తన సొంత అన్నను కూడా ఏరా అంటానని ఓ సందర్భంలో నాగ్ స్వయంగా చెప్పారు.