ఏ భాషలో అయినా ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఫామ్‌లో ఉన్న హీరో.. ఓ క్రేజీ డైరెక్టర్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ దగ్గర మీట్ ఓ రేంజ్లో ఉంటుంది. అయితే కొన్ని సినిమాలపై విపరీతమైన హైఎక్స్‌పెక్టేషన్స్ ఉండడంతో తొలి రోజు తొలి ఆట చూసిన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతారు. వారు భారీ అంచనాలతో ఉంటారు. వారి అంచనాలకు సినిమా ఏ మాత్రం తగ్గినా నిరాశపడతారు. అయితే ఆ తర్వాత సినిమా కామన్ ఆడియెన్స్‌కు ఎక్కడం స్టార్ట్ అయ్యాక స్లోగా ఎత్తుకుని హిట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా కూడా తొలి రోజు తొలి ఆట తర్వాత ప్లాప్ టాక్ తెచ్చుకుంది.. ఆ తర్వాత ప్రేక్షకులకు స్లోగా ఎక్కడి సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ఏదో కాదు నాన్నకు ప్రేమతో.
వరుస ప్లాపుల తర్వాత ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ మరుసటి యేడాది సంక్రాంతికి సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు. సంక్రాంతి పండగ.. అందులోనూ ఎన్టీఆర్ సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. టెంపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. 2016 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు నీరు గారిపోయారు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో అరివీర భయంకరమైన సినిమాతో మెప్పిస్తాడు అని వారు అనుకున్నారు.
ఎన్టీఆర్ కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్ తండ్రి సెంటిమెంట్ మిక్స్ చేయడంతో పాటు రివేంజ్ డ్రామాగా తెరకెక్కించాడు. ఎన్టీఆర్ క్లాస్ లుక్‌లో కనిపించాడు. సినిమా అంతా క్లాస్ లుక్‌తోనే ట్రావెల్ అవుతుంది. అసలు కొన్ని సీన్లలో సుకుమార్ లాజిక్కులు, ఈక్వేషన్లు సగటు సినీ అభిమానికి కూడా అర్థం కాలేదు. దీనికి తోడు ఈ క్లాస్ సినిమా ఎన్టీఆర్ ఇమేజ్‌కు సూట్ కాలేదని.. సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడడం కష్టమనే టాక్ వచ్చింది. దీంతో నిర్మాత బీవీఎస్ఎన్. ప్రసాద్ సైతం ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీశానే అని టెన్షన్ పడ్డారు.
ఈ సినిమా కొన్న బయ్యర్లు కూడా డీలా పడిపోయారు. వీరి టెన్షన్‌కు మరో కారణం కూడా ఉంది. ఈ సంక్రాంతికే బాలయ్య డిక్టేటర్, శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు కూడా వచ్చాయి. నాలుగు సినిమాల పోటీలో రావడంతో థియేటర్లు కూడా తక్కువగానే దొరికాయి. విచిత్రం ఏంటంటే ఈ నాలుగు సినిమాల్లో ముందు నాన్నకు ప్రేమతోనే రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత రిలీజ్ అయిన బాలయ్య డిక్టేటర్ మాస్ సినిమా అన్న టాక్ రావడంతో హిట్ అన్నారు.
శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా, నాగ్ సోగ్గాడే సినిమాలకు యునానమస్ హిట్ టాక్ వచ్చింది. దీంతో నాన్నకు ప్రేమతో ప్లాప్ అని అందరూ లెక్కకట్టేశారు. అయితే సినిమా చాలా స్లోగా ఎక్కింది. క్లాస్ ప్రేక్షకులు నెల రోజులు దాటినా కూడా థియేటర్లకు వచ్చి సినిమా చూశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్లాస్ ఆడియెన్స్ కు బాగా చేరువ అయ్యాడు. ఓవరాల్‌గా లాంగ్ రన్‌లో రు. 54 కోట్ల షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర క్లీన్‌హిట్‌గా నిలిచింది.