టాలీవుడ్ లో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ విక్టరీ వెంకటేష్. దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ చాలా తక్కువ టైమ్ లోనే సూపర్ హీరోగా ఎదిగాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమా తో కెరీర్ ప్రారంభించిన వెంకటేష్ కెరీర్లో ఏకంగా 70 నుంచి 80 శాతం విజయాలు ఉన్నాయంటే నమ్మాల్సిందే. వెంకటేష్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువగా రీమేక్ సినిమాల పైనే ఆధార పడుతూ వచ్చారు. అప్పటికే ఒక భాషలో హిట్ అయిన సినిమా రైట్స్ సురేష్ ప్రొడక్షన్ కొనుగోలు చేసి వెంకటేష్ హీరోగా తెరకెక్కించడంతో వెంకటేష్‌కు ఎక్కువ హిట్లు పడ్డాయి.
వెంకటేష్ అంటేనే కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రేమకథా చిత్రాల హీరోగా అప్పట్లో ఎక్కువ క్రేజ్ ఉండేది. ప్రేమించుకుందాం రా – ప్రేమంటే ఇదేరా – కలిసుందాం రా – పెళ్లి చేసుకుందాం – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇలా ఎక్కువగా ఫ్యామిలీలతో పాటు యూత్ ను టార్గెట్ గా చేసుకుని వెంకటేష్ సినిమాలు వచ్చేవి. వెంకటేష్ – సీనియర్ డైరెక్టర్ జయంత్ కాంబినేషన్లో ప్రేమించుకుందాం రా – ప్రేమంటే ఇదేరా రెండు సినిమాలు వచ్చి రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ప్రేమించుకుందాం రా సినిమాలో అప్పట్లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఉన్న అంజలా జవేరిని తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రేమంటే ఇదేరా సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రీతిజింతా వెంకటేష్ పక్కన నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన కామెడీ సీన్లు, ప్రేమ సీన్లు యూత్‌ను పిచ్చెక్కించేశాయి. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమాలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేయాల్సి ఉంది.
జయంత్‌కు ఐశ్వర్యరాయ్ తో ఉన్న పాత స్నేహం నేపథ్యంలో ఆమెకు కథ చెప్పడంతో ఆమె వెంటనే కన్నీళ్లు పెట్టుకుని… వెంటనే డేట్లు ఇస్తానని… తాను ఈ సినిమాలో నటిస్తానని చెప్పిందట. అయితే అప్పటికే ఆమెకు రెండు మూడు ప్లాప్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా నిర్మాతలు ప్లాప్ హీరోయిన్ ను సినిమాలో ఎలా పెట్టుకుంటారు అన్న డౌట్ వ్యక్తం చేయడంతో… చివరకు జయంత్ ఐశ్వర్యరాయ్ కు బదులుగా ప్రీతిజింతాను తీసుకున్నారు. అలా ఐశ్వర్యారాయ్ – వెంకటేష్ కాంబినేషన్ మిస్ అయ్యింది.
అయితే ఐశ్వర్యారాయ్ – జయంత్ స్నేహం మాత్రం అలాగే ఉండేదట. నాగార్జున హీరోగా జయంత్ దర్శకత్వంలో రావోయి చందమామ సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఐశ్వర్యారాయ్ నటించింది. ముందుగా ఈ సాంగ్‌కు ప్రితీజింతానే తీసుకోవాలని అనుకున్నాడట జయంత్. అయితే జయంత్ ముంబై వచ్చిన విషయం తెలుసుకున్న ఐశ్వర్య తానే ఈ సాంగ్ చేస్తానని చెప్పి మరీ చేసిందట.