విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నట విశ్వరూపం చూపించిన సినిమా దానవీరశూరకర్ణ. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటకీ చెక్కు చెదరని ఎన్నో అనితర సాధ్యమైన రికార్డులు ఈ సినిమా సొంతం.
జనవరి 14, 1977న ఈ చిత్రం విడుదలైంది. అసలు ఈ సినిమా ప్రారంభం నుంచి.. షూటింగ్.. రిలీజ్.. ఆ తర్వాత రికార్డులు అన్ని కూడా ఓ సంచలనమే. అసలు ఈ సినిమాపై ముందు ఎవ్వరికి పెద్ద అంచనాలు లేవు. అయితే మహాభారత కథతో ఎన్టీఆర్ ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పట్లో కృష్ణకు ఎన్టీఆర్‌కు మధ్య సినిమాల పరంగా తీవ్రమైన పోటీ ఉండేది. వెంటనే కృష్ణ కూడా ఎవ్వరికి చెప్పకుండా కురుక్షేత్రం సినిమా ఎనౌన్స్ చేసేశారు. అంతేకాకుండా అప్పుడు కీలక నటులు అందరిని ఆయన తన సినిమాలో బుక్ చేసేసుకున్నారు.
పైగా రెండూ మహాభారత కథలే.. కృష్ణ సినిమాకే కీలక నటులు వెళ్లిపోవడంతో చివరకు ఎన్టీఆర్ సినిమాకు పేరున్న నటులు లేని పరిస్థితి. దీంతో కర్ణ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయ్యారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. చివరకు నిర్మాత.. చివరకు నటులు లేకపోవడంతో బాలకృష్ణ, హరికృష్ణకు కూడా కీలక పాత్రలు ఇచ్చి నటింపజేసేశారు. చివరకు పోటాపోటీగా కురుక్షేత్రం, కర్ణ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. అతి తక్కువ రోజుల్లోనే షూటింగ్ జరుపుకున్న సినిమాగా కర్ణ రికార్డులకు ఎక్కింది.
ఎన్టీఆర్ అన్ని బాధ్యతలు తీసుకోవడంతో పాటు సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటించాడు. శ్రీకృష్ణుడిగా, సుయోధనుడిగా, కర్ణుడిగా ఆయన నటన అనితరసాధ్యం. ఈ సినిమాపై ఎన్టీఆర్ సాంకేతికత కంటే తన సమర్థతనే నమ్ముకున్నారు. అందుకే జనాలు నీరాజనాలు పలకడంతో పాటు సినిమాకు పట్టం కట్టారు. అప్పట్లో ఓ పౌరాణిక సినిమా.. అందులోనూ మహాభారత నేపథ్యంలో సినిమా తీయాలంటే భారీ భారీ సెట్టింగులు ఉండాలి.. నెలల తరబడి షూటింగ్‌లు చేయాలి.. కానీ అవేమి లేకుండా కేవలం 43 రోజుల్లో కర్ణ సినిమాను పూర్తి చేశారు.
ఎన్టీఆర్ – కొండవీటి వెంకట కవి కలిసి ఈ సినిమా రచన చేశారు. కేవలం రు. 10 లక్షలు ఖర్చు చేసి తక్కువ రోజుల్లో అంత క్వాలిటీ ఈ సినిమా తీయడం అప్పట్లో ఓ సంచలనం. ఇక కీలక నటులను కృష్ణ కురుక్షేత్రం సినిమాకు తీసేసుకోవడంతో ఎన్టీఆర్.. ఏఎన్నార్‌ను కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో నటించమని కోరారట. ఎన్టీఆర్‌ను కృష్ణుడిగా చూసిన జనాలు తనను చూడలేరని.. తాను కర్ణుడిగా నటిస్తే పాండవులు మరుగుజ్జులుగా కనిపిస్తారని అన్నారట. అలా సున్నితంగా ఎన్టీఆర్ ఆఫర్‌ను ఏఎన్నార్ తిరస్కరించారు.
అయితే ఆ మరుసటి రోజే ఏఎన్నార్‌కు జలగం వెంగళరావు నుంచి పిలుపు వచ్చిందట. మీరు ఇద్దరు కలిసి మహాభారత కథలో నటిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఒప్పుకోమని చెప్పారట. అయితే ఏఎన్నార్ మరోసారి ఎన్టీఆర్‌కు చెప్పిన కారణాన్నే ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు చెప్పి తప్పించుకున్నారట. దీంతో కర్ణుడు, శ్రీకృష్ణుడు పాత్రలు కూడా చివరకు ఎన్టీఆరే వేశారు.
చివరకు కురుక్షేత్రం, కర్ణ పోటీగా రిలీజ్ అయ్యాయి. అయితే కర్ణ ముందు కురుక్షేత్రం ఆగలేదు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా సంభాషణలు ఎంత పాపులర్ అంటే వాటి ఎల్పీలు, క్యాసెట్లు భారత సినీ చరిత్రలో మరే సినిమాకు అమ్ముడపోనంత స్థాయిలో అమ్ముడయ్యాయి. ఇక భారత సినీ చరిత్రలో 3.43 నిమిషాల సుధీర్ఘమైన నిడివి ఉండి.. కేవలం 43 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న మరో అనితర సాధ్యమైన రికార్డు కూడా కర్ణ ఖాతాలోనే ఉంది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటకీ చెక్కు చాలా రికార్డులు చెక్కు చెదర్లేదు. భారత సినీ చరిత్రలో ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.