సీనియర్ ఎన్టీఆర్ ఒక్కోసారి అంతే.. క్రమశిక్షణ విషయంలోనూ.. పంతం విషయంలోనూ ఆయన పట్టుదలకు పోతూ ఉంటారు. 1964లో గుడిగంటలు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. సినిమాలో సిగరెట్ కాల్చే పాత్ర ఉంటే ఎన్టీఆర్ రెండు ఎక్స్‌ప్రెస్ డబ్బా సిగరెట్లు రోజులోనే ఉఫ్‌మని ఊదేసేవారట. అందుకే గుడిగంటలు షూటింగ్‌లో రోజుకు రెండు డబ్బాల ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు తెప్పించి మరీ రెడీగా ఉంచేవారట.
ఈ రోజుల్లో ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు అంటే క్రేజ్.. అవి గుండ్రటి డబ్బాల్లో ఉండేవి. ఒక్కో డబ్బాలో 20 సిగరెట్లు ఉండేవి. అవి ఫారిన్ బ్రాండ్ కావడంతో ఎక్కడపడితే అక్కడ దొరికేవి కావు. ఈ సినిమాలో కొన్ని సీన్లలో ఎన్టీఆర్ ఆ సిగరెట్ డబ్బాతోనే కనపించారు. ఇక ఈ సినిమాకు డూండీ నిర్మాత కాగా.. విక్టరీ మధుసూధన్ రావు దర్శకుడు. ఇక ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఓ డబ్బా, మధ్యాహ్నం భోజనాల తర్వాత 1 గంటకు మరో డబ్బా ఎన్టీఆర్ చేతిలోకి చేరిపోవాలి.
ఓ రోజు సెట్లో రచయిత ముళ్లపూడితో పాటు నిర్మాత డూండీ లేరు. దీంతో ఎన్టీఆర్ కోసం తెప్పించిన డబ్బా సీల్ తీసి కొన్ని సిగరెట్లు ఊదేశారట. సీల్ తీసిన డబ్బాలో కేవలం రెండు సిగరెట్లు మాత్రమే ఉండడంతో ఎన్టీఆర్‌కు చిర్రెత్తుకొచ్చేసిందట. ఎవరో సీల్ తీసి సిగరెట్లు కాల్చారంటూ.. వెంటనే కేకలు వేయడంతో పక్కనే ఉన్న బాయ్ వెళ్లి నిర్మాత డూండీకి సార్ కోపంతో ఉన్నారని చెప్పాడట. డూండీ ఎన్టీఆర్ కోపాన్ని లైట్ తీస్కొన్నా… ఎన్టీఆర్ మాత్రం ఫుల్ డబ్బా లేనిదే తాను సెట్‌కు రానని భీష్మించుకున్నారట.
చివరకు షాక్ తిన్న డూండీ పోయేదేముంది సీల్ సిగరెట్ డబ్బా కొత్తది తెప్పిద్దామని బాయ్‌కు కారు ఇచ్చి వెళ్లమన్నారట. ప్రొడక్షన్ అసిస్టెంట్ చిట్టిబాబును పిలిచి ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు ఓ డబ్బా తెమ్మని చెప్పారట. మామూలుగా ఇవి టీ నగర్‌లో కిల్లీ కొట్లలో దొరుకుతాయి. ఆ రోజు అక్కడ లేవు. చివరకు అవి ఎక్కడ దొరకుతాయో తెలుసుకుని ఆరు మైళ్ల దూరంలో ఉన్న పారిస్ కార్నర్‌లోని కాశీచెట్టి వీథికి వెళ్లి ఎలాగోలా ఓ డబ్బా పట్టుకుని షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారట.
అలా ఆ డబ్బా వచ్చే సరికే 4 అయ్యింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రారంభమయ్యే షూటింగ్ 4కు కాని మొదలు కాలేదట. అయితే అప్పటికే ఎన్టీఆర్ బాగా కోపంతో ఉన్నారట. ఆ డబ్బా తీసి ఆయన సిగరెట్ కాల్చాక కాని సెట్లోకి ఎంట్రీ ఇవ్వలేదట. అయితే ఎన్టీఆర్‌ను చాల్లార్చేందుకు నిర్మాత డూండీతో పాటు ముళ్లపూడి వారు సారీ చెప్పారట. అయితే ఎన్టీఆర్ సిగరెట్ కోసం కాదు ఈ పంతం బ్రదర్.. డిసిప్లెన్.. దీనికి తాను కూడా అతీతుడిని కాదని చెప్పారట. ఎన్టీఆర్ క్రమశిక్షణతో పాటు కొన్ని ప్రిన్సిపుల్స్ విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో చెప్పేందుకు ఇదే నిదర్శనం.