ప్రస్తుత రోజుల్లో సినీ రంగంలోకి ప్రవేశించాలంటే.. అనేక మార్గాలు ఉన్నాయి. చిన్నపాటి వీడియోనో.. ఆడియోనో.. చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. అది కనుక పాపులర్ అయితే.. సినీ రంగంలోకి ప్రవేశిం చడం పెద్ద కష్టం కాదు. అయితే.. 1960లలో మాత్రం సినీ రంగంలోకి ప్రవేశించాలంటే.. అంత ఈజీకాదు. పైకా సాంకేతిక సహకారం, కమ్యూనికేషన్ వ్యవస్థ లేని రోజులు. దీంతో సినిమాల్లోకి ప్రవేశించాలనుకునే వారు.. ఆపశోపాలు పడేవారు. స్టూడియోల చుట్టూ తిరిగేవారు. పరిచయం ఉన్నవారిని పట్టుకున్నా.. పను లు అయ్యే పరిస్థితి అప్పట్లో ఉండేది కాదు!
ఇలాంటి సమయంలో సినీ రంగంలోకి ఒకపాటల రచయితగా ప్రవేశించాలని భావించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. ఉరఫ్ సినారే కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ఆయన అప్పటికే ఆయన చెయిదిరిగిన రచయిత. అయినా.. అప్పటికే.. సినీ రంగంలో సముద్రాల, శ్రీశ్రీ వంటి ఉద్ధండులు ఉండడంతో కొత్తవారిని చేర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అప్పటికే అనేక ప్రయత్నాలు చేసిన సినారే.. తిరిగి విజయవాడ వచ్చేసేందుకు మద్రాస్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే.. ఆ సమయంలో కొందరు తెలుగు వారు.. ఆయనను గుర్తించి.. అక్కడే ఒక శాలువాకప్పి.. సన్మానించేశారు.
ఈ విషయం అనేక సందర్భాల్లో సినారే చెప్పుకొచ్చారు. మద్రాస్ రైల్వే స్టేషన్ రెండో నెంబరు ప్లాట్‌ఫాంపై జరిగిన ఆ చిన్న సన్మానమే.. తనకు, రామారావుకు స్నేహం కుదిరేలా చేసిందని ఆయన వెల్లడించారు. ఈ సన్మానం విషయం.. అప్పట్లో ఆంధ్రపత్రికలో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ విషయం.. అన్నగారి దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే ఆయన సినారేను సొంత ఖర్చులతో మళ్లీ మద్రాసుకు పిలిపించుకుని.. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన గులేబకావళి కథ(1962) సినిమాలో ఒక పాట రాసే అవకాశం సినారేకు కల్పించారు.
ఈ విషయంలోనూ అన్నగారు పెద్ద ఫైటే చేశారని.. సినారే చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. కమలాకర కామేశ్వరరావు కూడా ఒక పట్టాన కొత్తవారికిఅవకాశం ఇచ్చేవారట. కానీ, అన్నగారు చెప్పారని.. సినారేకు అవకాశం ఇచ్చినా.. ఆ పాట హిట్టవుతుందో లేదో అనే ఆందోళన ఉందట. అయినప్పటికీ.. అన్నగారు.. సాహసం చేసి.. సినారేకు అవకాశం కల్పించారట.
ఇలా.. సినారే రాసిన తొలి పాట `నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని“. ఇది తర్వాత కాలంలోనే కాదు. ఇప్పటికీ సూపర్ హిట్. ఇక, ఆ తర్వాత సినీ రంగంలో వెనక్కి తిరిగి చూసుకోలేదట. దాదాపు 3 వేలకు పైగా పాటలురాశారు. తర్వాత కాలంలో టీడీపీ నుంచి ఆయన రాజ్యసభకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అన్నగారికి రుణ పడిపోయానంటూ.. సినారే పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు.