మరి కొద్ది గంటల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ముగ్గురు కలిసి కట్టుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ప్రమోషన్లు అయితే మామూలుగా లేవు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రు. 453 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ప్రి రిలీజ్ బుకింగ్స్ చూస్తుంటే మాత్రం తెలుగులో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. తెలుగులో పాత రికార్డులకు ఈ సినిమా పాతరేసేలా ఉంది.
ఇక తమిళనాడు, కర్నాకట, కేరళలోనూ బుకింగ్స్ బాగున్నాయి. ఇక ఓవర్సీస్‌లో అయితే ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి 2 రికార్డులను కూడా దాదాపు బీట్ చేసింది. ఇక ఓవర్సీస్‌లో తెలుగులో అదిరిపోయే బజ్ ఉండగా.. మిగిలిన భాషల్లో ఓ మోస్తరు బజ్ ఉందని అంటున్నారు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం త్రిబుల్ ఆర్ టిక్కెట్ రేట్లు చుక్కల్లోనే ఉంటున్నాయి.
దేశ రాజధాని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్) ఢిల్లీ ప్రాంతంలో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా 2100 రూపాయలు ఉంది. అది కూడా ఎలాంటి పన్నులు లేకుండానే. ప్రముఖ బుకింగ్ యాప్ బుక్ మై షోలో అధికారికంగానే ఈ రేట్లు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. త్రీడీ ప్లాటినం సుపీరియల్ విభాగంలో అయితే రేటు రు. 2100 గా ఉంది. అదే 3డీ ప్లాటినంలో అయితే రు. 1900 అమ్ముతున్నారు.
ఇక మరో మెట్రో సిటీ ముంబైలో అయితే 3 డీ రిక్లైనర్ సిట్లు ఒక్కొక్కటి పన్నులు లేకుండానే రు. 1720కు అమ్ముతున్నారు. ముంబయ్ లో 3డీ క్లాసిక్ అయితే మాత్రం టిక్కెట్ ధర 770 రూపాయలుగా ఉంది. ఇక కోల్‌కొత్తాలో ఒక్కో టిక్కెట్ రేటు రు. 1090 గా ఉంది. ఇంత భారీ రేట్లు ఉన్నా సరే ఇప్పటకీ అన్ని థియేటర్లు దాదాపు హౌస్ ఫుల్‌గా చూపిస్తున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా త్రిబుల్ ఆర్ సినిమా కోసం రేట్లు పెంచుతూ ప్రభుత్వాలే ప్రత్యేకంగా జీవోలు జారీ చేశాయి. ఇక అదనపు షోలు ఎలాగూ ఉన్నాయి. ఇక సినిమా టాక్‌ను బట్టి త్రిబుల్ రికార్డుల దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక థియేటర్లలో భారీ క్రౌడ్ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎక్కడ తెరకు ఆటంకం కలిగిస్తారో ? అన్న భయంతో తెరల ముందు థియేటర్ల ఓనర్లు ఏకంగా మేకులు కొట్టడంతో పాటు ముళ్ల కంచెలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.