హమ్మయ్యా మూడేళ్లుగా.. రెండేళ్లుగా ఊరిస్తూ వస్తోన్న మన తెలుగు పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా థియేటర్లలోకి వస్తున్నాయి. అఖండ, పుష్ప, భీమ్లానాయక్, బంగార్రాజు.. తాజాగా రాధేశ్యామ్ వచ్చేశాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి త్రిబుల్ ఆర్ సినిమా మీదే ఉంది. మిగిలిన అన్ని పెద్ద సినిమాల కథ వేరు.. ఈ త్రిబుల్ ఆర్ రేంజ్ వేరు. భారతేదశ సినిమా చరిత్రను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి.. చాలా దేశాల వాళ్లను కూడా భయపెట్టిన సినిమా బాహుబలి. అలాంటి గొప్ప సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా త్రిబుల్ ఆర్.
ఇదే ఒక ఎత్తు అయితే టాలీవుడ్‌లో రెండు భిన్న ధృవాల కాంపౌండ్‌లకు చెందిన యంగ్ క్రేజీ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో చరిత్రలో పోరాట యోధులుగా ఉన్న కొమరం భీం, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లను తీసుకుని తెరకెక్కించిన సినిమా కావడం మరో ఎత్తు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ సినిమాకు ఉన్నాయి. పైగా బాలీవుడ్ నుంచి సీనియర్ హీరో అజయ్‌దేవగన్, ఆలియా భట్‌తో పాటు శ్రీయాచరన్, బ్రిటీష్ నటి ఓవీలియా మోరిస్ తదితరులు నటిస్తున్నారు.
రు. 500 కోట్ల బడ్జెట్ అంటున్నారు.. రు. 1000 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్.. ఆ రేంజ్ వసూళ్లు టార్గెట్ అంటున్నారు. రాజమౌళి – ఎన్టీఆర్ – చరణ్ ఉన్నా బొమ్మ పడే వరకు ఏదో భయం ఉంటూనే ఉంటుంది. సినిమా రంగంలో ఎవరి జాతకాలు అయినా శుక్రవారంతో తల్లకిందులు అయిపోతూ ఉంటాయి. సరే ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఎంతలా బజ్ ఉంది ? ఏ రేంజ్ ఆసక్తి ఉంది అనేందుకు ప్రీమియర్ బుకింగ్స్ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా రిలీజ్‌కు ముందు రికార్డుల దుమ్ము దులుపుతోంది త్రిబుల్ ఆర్.
యూఎస్ ప్రీమియర్ బుకింగ్స్ నుంచి ఇప్పటికే మిలియన్ మార్క్ వసూళ్లు దాటేసింది. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఇంకా సినిమా రిలీజ్‌కు మరో 13 రోజుల టైం కూడా ఉంది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుని.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులు తన పేరిట లిఖించుకుంది. మహామహా గొప్ప హీరోల సినిమాలు.. గొప్ప కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాలకు కూడా ఈ రికార్డు లేదు.
అంతే కాదు.. ఈ రికార్డు చూసి ప్రతి తెలుగువాడు… ప్రతి తెలుగు సినిమా అభిమాని చాలా గర్వంగా ఫీలవుతున్నారు. ఇది నిజంగా అసాధారణ రికార్డే అని చెప్పాలి. ఈ 13 రోజుల్లో బుకింగ్స్ మరింత స్పీడ్‌గా ఉంటాయి. దీనిని బట్టి బొమ్మ పడకుండానే త్రిబుల్ ఆర్ ఎన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకోబోతుందో ఊహకే అందడం లేదు. ప్రీమియర్ల ద్వారానే ఈ రికార్డుకు చేరుకోవడంతో రేపటి రోజున అక్కడ త్రిబుల్ క్రియేట్ చేసే సంచలనాలు ఊహించుకోవడానికి ఊహకే అందడం లేదు. ఇక ఓవర్సీస్‌లో మార్చి 24 నుంచి ప్రీమియర్లు స్టార్ట్ అవుతాయి.