రాజమౌళి మానియా ఇండియాలోనే కాదు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. రాజమౌళి ఎప్పుడు ఏ సినిమా చేసినా.. ఇంకేం చేసినా కూడా సంచలనమే అవుతుంది. అంత పెద్ద గొప్ప సెలబ్రిటీ అయిపోయాడు. అసలు అపజయం అన్నదే రాజమౌళి దరి చేరకుండా సూపర్ హిట్లు తీస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా హీరో ప్రభాస్, త్రిబుల్ ఆర్ దర్శకుడు రాజమౌళి మధ్య బాహుబలి సినిమా టైం నుంచి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బాహుబలి సినిమా రెండు సీరిస్‌ల కోసం రాజమౌళి – ప్రభాస్ కలిసి దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా ట్రావెల్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ రాధేశ్యామ్ కోసం రాజమౌళి స్వయంగా ప్రమోషన్లలోకి దిగాడు.
ఈ క్రమంలోనే తన కుటుంబం గురించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కుటుంబం చాలా పెద్దది.. వాళ్ల నాన్నలు మొత్తం ఐదుగురు అన్నదమ్ములు. వీరిలో శివశక్తి దత్త పెద్దవారు. అందరిలోనూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చిన్నవారు. ఈ కుటుంబంలో ఎక్కువ మంది సినిమా రంగంలోనే ఉన్నారు. రాజమౌళి కుటుంబంలో మొత్తం 60 మంది వరకు ఉంటారట. ఓ సినిమాకు పని చేయాలంటూ వీరందరు కలిసి వివిధ శాఖల్లో పని చేస్తూనే ఉంటారట.
ఇక రాధేశ్యామ్ ప్రమోషన్లలో రాజమౌళి మాట్లాడుతూ తన కుటుంబం మొత్తానికి ఫస్ట్ డే ఫస్ట్ షో అన్న వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందని.. అందులో 40 – 44 మంది వరకు ఉంటారని చెప్పాడు. శుక్రవారం సినిమా రిలీజ్ ఉందంటే రాజమౌళి భార్య రమా అందరికి టిక్కెట్లు బుక్ చేస్తుందట. ఈ శుక్రవారం ఆ సినిమా రిలీజ్ అవుతుందని ముందే మెసేజ్ పెడతారట రమా.. ఆ సినిమా చూసేందుకు ఆసక్తితో ఉన్నవాళ్లు వెంటనే మెసేజ్ పెడితే అన్ని టిక్కెట్లు బుక్ చేస్తారట.
ప్రతి వారం సినిమాకు 10 – 15 మంది మాత్రమే సినిమా చూస్తాం అని మెసేజ్ పెడతారట. అదే రాధేశ్యామ్ సినిమాకు ఏకంగా 44 మంది సినిమా చూస్తాం అని మెసేజ్‌లు పెట్టారట. దీనిని బట్టి రాధేశ్యామ్ సినిమా చూసేందుకు తమ కుటుంబ సభ్యులు ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థమవుతోందని రాజమౌళి చెప్పారు. ఇక తాను ఇప్పటికే సినిమా చూశానని.. ఎడిట్ రూమ్‌లో కూడా ఎవ్వరూ లేకుండా సినిమా చూడడానికి.. అందరితో కలసి సినిమా చూడడానికి చాలా తేడా ఉందని .. సినిమా రిలీజ్ కోసం తాను ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నానని చెప్పారు.