దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఇప్పుడు భారత దేశ ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మెగాఫోన్ పట్టిన రాజమౌళి తన 20 సంవత్సరాల కెరీర్లో అసలు ఓటమి అన్నది లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ భారతీయ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక రాజమౌళి కెరీర్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కచ్చితంగా బాహుబలి సినిమాకే దక్కుతుంది.
ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రను గతంలో శివ సినిమాకు ముందు… శివ సినిమాకు తర్వాత అని ఎలా చెప్పారో ? ఇప్పుడు బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమాకు తర్వాత అని విభజించి చూస్తున్నారు. బాహుబలి సినిమా కొత్త యుగానికి నవశకంగా చెబుతున్నారు. బాహుబలి సినిమా అనేది కేవలం ప్రభాస్.. రాజమౌళికి మాత్రమే ఒక బెంచ్ మార్కు సినిమా కాలేదు. భారతదేశంలో అన్ని భాషల్లో ఉన్న స్టార్ హీరోలకు… అన్ని ఇండస్ట్రీలకు ఒక బెంచ్‌మార్క్‌గా మారింది. అయితే ఈ సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన జయం మనదేరా సినిమాకు కాపీయా ? అన్న సందేహాన్ని ఓ విద్యార్థి రాజమౌళి ముందు వ్యక్తం చేశాడు.
రాజమౌళి ఒకసారి ఓ కాలేజ్ ప్రోగ్రామ్ వెళ్లాడు. అక్కడ పలువురు విద్యార్థులు రాజమౌళిపై ప్రశ్నల వర్షం కురిపిస్తే.. రాజమౌళి ఆ విద్యార్థులకు తనదైన స్టైల్లో ఆన్సర్లు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి బాహుబలి సినిమా జయం మనదేరా సినిమా లైన్ నుంచి డవలప్ చేసినట్టుగా తనకు అనిపించిందని రాజమౌళికి షాకింగ్ ప్రశ్న వేశాడు. అయితే వెంటనే రాజమౌళి తాను జయం మనదేరా సినిమా చూశానని చెప్పాడు. బాహుబలి కథ జయం మనదేరా సినిమా నుంచి పుట్టలేదని… నా చిన్నప్పటి అనుభవాలు… పుస్తకాల్లో చదువుకున్న అంశాలు… తన ఊహా లోకంలో కళ్ళముందు కదలాడిన అంశాల ఆధారంగా ఈ కథ పుట్టుకొచ్చిందని రాజమౌళి చెప్పాడు.
తన సినిమాలు వాస్తవికతకు… సాధారణ జీవనానికి దూరంగా ఉంటాయని… లార్జర్ దెన్ లైఫ్ రేంజ్ లో తన సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటా అని రాజమౌళి చెప్పాడు. ఇక మరో విద్యార్థి ప్రభాస్‌తో మళ్లీ మీ సినిమా ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న వేశాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడని… ప్రభాస్ ఎప్పుడు ఫ్రీ అవుతాడో.. తనకు ఎప్పుడు కుదురుతుందో గాని.. మరో సారి తప్పకుండా సినిమా చేస్తానని తెలిపాడు.