రాజమౌళి ఎన్ని హిట్ సినిమాలు తెరకెక్కించినా ఈ సినిమాల విజయంలో ఆయన ఫ్యామిలీ కష్టం కూడా ఎంతో ఉంటుంది. రాజమౌళి సినిమాల కోసం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎంతో ఎఫర్ట్ పెట్టి మరీ కథలు రాస్తాడు. రాజమౌళి సినిమాల కథలు ఎంత వపర్ ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాజమౌళి సినిమా కోసం ఆయన భార్య రమా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తుంది. కీరవాణి ఎలాగూ మ్యూజిక్ ఇస్తారు. రాజమౌళి సినిమాలకు కీరవాణి మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పక్కర్లేదు.
ఇక కీరవాణి భార్య శ్రీ వల్లి లైన్ ప్రొడ్యుసర్‌గా ఉంటారు. రాజమౌళి కొడుకు కార్తీకేయ కూడా దర్శకత్వ విభాగంలోనో, డిజిటల్ ప్రమోషన్లలోనో బిజీగా ఉంటాడు. ఇక రాజమౌళి ఫ్యామిలీలో మిగిలిన వారు కూడా ఆయన సినిమాలకు ఏదో ఒక రూపంలో పని చేస్తూనే ఉంటారు. ఇక రాజమౌళిది ప్రేమ వివాహం అని.. తన అన్న కీరవాణి భార్య వల్లి అక్క అయిన రమాను రాజమౌళి ప్రేమ వివాహం చేసుకున్నాడని అందరికి తెలుసు.
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ది కూడా ప్రేమ వివాహమే అట. ఈ విషయాన్ని త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో ఆయనే బయట పెట్టారు. ఓ విలేకరి జూనియర్ ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌లతో సినిమా చేయడం అంటే కమ్మ – కాపు ఈక్వేషన్లను అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా ? అన్న ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ విజయేంద్ర ప్రసాద్ తన కుటుంబ నేపథ్యం మొత్తం చెప్పుకువచ్చాడు.
1966లో తమ పెళ్లి జరిగింది అని.. తనది కమ్మ కులం అని… అసలు తన భార్యది ఏ కులమో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. అయితే చిరంజీవి ఖైదీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం తన భార్య మా చిరంజీవి అని చెప్పడంతో అప్పుడే ఆమె కాపు కులం అన్నది తనకు అర్థమైందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. మా చిరంజీవి అంటే ఏంటని అడిగితే చిరంజీవి కాపు కులానికి చెందిన వ్యక్తేగా ? అని ఆమె చెప్పిందని ఆయన అన్నారు.
ఇక తన కుటుంబంలో చాలా మందికి ప్రేమ వివాహాలు జరిగాయని.. అవి చాలా వరకు కులాంతర వివాహాలే అని ఆయన చెప్పారు. రెడ్డి, పద్మశాలీ, కాపు కులానికి చెందిన వాళ్లను మా అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకున్నారని.. అసలు తమ కుటుంబంలో కులం పట్టింపు అనేదే ఉండదని ఆయన అన్నారు. చాలా సామాజిక వర్గాలతో తమ కుటుంబం బంధుత్వం కలుపుకుందని ఆయన చెప్పారు.