యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ప్రభాస్ నటించిన సాహో సినిమా తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి దిగుతోంది. మూడేళ్ల లాంగ్ గ్యాప్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కావడం.. అందులోనూ 1960 నాటి యూరప్ ప్రేమకథ కావడం… బాలీవుడ్ లోనూ ఈ సినిమాకు భారీగా ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో అంచనాలు మామూలుగా లేవు.
ప్రభాస్‌కు సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ పతాకంపై రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. కేవలం గోపీచంద్‌తో జిల్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ టేకింగ్‌పై నమ్మకంతోనే ప్రభాస్ ఈ సినిమా చేశాడు. కథ అయితే కొత్తగా ఉంటుందని.. మరీ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందా ? అన్న ఆసక్తే ఇప్పుడు అందరిలోనూ ఉంది.
ఇక ఈ సినిమా రిలీజ్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇక ప్రభాస్ అభిమానులు, తెలుగు సినీ లవర్స్ అందరూ కూడా సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా ? అని ఉత్కంఠతో ఉన్నారు. ఇక ఏపీలో ఐదు షోలకు పర్మిషన్లు రావడంతో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కూడా ఉండడం రాధేశ్యామ్‌కు మరింత ప్లస్ అయ్యింది.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుకు మాత్రమే ఐదు షోలు అని చెపుతున్నారే కాని.. ఎన్ని షోలు వేసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచి మరీ అమ్ముకుంటున్నారు. ఏపీలో కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉండొచ్చు. ఇక ఏపీ, తెలంగాణలో ఈ రోజు అర్ధరాత్రి దాటాక ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. బహుశా తెల్లవారు ఝామున 4 గంటల నుంచి పలు చోట్ల ప్రీమియర్లు వేస్తున్నారు.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షో మాత్రం తెలంగాణలోనే పడుతోంది. హైదరాబాద్లోని కూకట్‌పల్లి అర్జున్ థియేటర్లో ఫస్ట్ ప్రీమియర్ షో వేస్తున్నట్టు శ్రేయాస్ మీడియా అధికారికంగా వెల్లడించింది. ఇక్కడ నుంచే రాధేశ్యామ్‌ను మీ ముందుకు తీసుకు వస్తున్నట్టు శ్రేయాస్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.