సినీ జగత్తులో తనకంటూ.. ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్న నందమూరి తారకరామారావు జీవితంలో అనేక మెరుపులు ఉన్నాయి. అదేసమయంలో అనేక ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇలాంటి ఇబ్బంది ఆయన ఊహించనిది! దీని కారణంగా.. ఆయన ఏకంగా.. కోట్ల రూపాయలను వదులుకోవాల్సి వచ్చింది. ఎంత మంది బ్రతిమలాడినా.. ఖాళీ చెక్కులు తెచ్చి.. మీకు నచ్చినంత సొమ్ము తీసుకోమని చెప్పినా.. ఆయన వినిపించుకోలేదు. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన జీవితంలో ఇక ఎప్పుడూ.. అలాంటి పాత్రను అన్నగారు ధరించలేదు. ఎన్నో ఆఫర్లను కోట్ల రూపాయలను తృణ ప్రాయంగా వదులుకున్నారు.
విషయంలోకి వెళ్తే.. అది 1960-62 సంవత్సరాల మధ్యకాలం. అన్నగారు సినీ రంగంలో దూసుకుపోతున్న కాలం. హీరోగా.. సాంఘిక సినిమాలు.. పౌరాణిక పాత్రల్లోనూ ఫుల్లు బిజీగా ఉన్న సమయం. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సినిమాలకు ఎక్కువగా ఆదరణ ఉండేది. దీంతో పౌరాణిక పాత్రలకు ఎక్కువగా అన్నగారు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ క్రమంలో అనేక చిత్రాల్లో ఆయన నటించారు. స్వయంగా పౌరాణిక చిత్రాలు కూడా తీశారు. ఈ కోవలోనే.. అన్నగారు.. 1962లో `దక్షయజ్ఞం` సినిమాలో నటించారు. ఈ సినిమా మొత్తం కూడా పరమశివుడి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అంటే.. హీరో.. శివుడే!
దీంతో అన్నగారు శివుడి పాత్రలో నటించారు. 1960లో ప్రారంభమైన ఈ సినిమా 1962లో విడుదలైంది. సుమారు రెండేళ్లపాటు షూటింగు జరుపుకొంది. సినిమా పూర్తయి పోయి.. విడుదల కూడా అయింది. భారీ ఎత్తున కలెక్షన్లను రాబట్టింది. అయితే.. సినిమా 50వ రోజు ఫంక్షన్‌ను విజయవాడలోని దుర్గా కళామందిరం హాల్ వద్ద నిర్వహించాలని నిర్నయించారు. అన్నగారు చెన్నై నుంచి బయలు దేరారు. ఇంతలోనే ఆయనకు పెద్ద దుర్వార్త వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు.. నందమూరి రామకృష్ణ.. హఠాన్మరణం చెందారు అనేది వార్త. దీంతో అన్నగారు.. ఒక్కసారిగా హతాశులయ్యారు. ఎలా జరిగిందో కూడా ఆయనకు అంతుచిక్కలేదు.
కట్ చేస్తే.. ఒకరోజు.. అప్పట్లో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు విఠలాచార్య అన్నగారి ఇంటికి వచ్చారు. ఆయన వెంట… ఓ జ్యోతిష్యుడు కూడా వచ్చారు. అన్నగారు.. సావధానంగా వారితో మాట్లాడారు. విఠలాచార్య అంటే.. అన్నగారికి అమితమైన గౌరవం. ఆయన దర్శకత్వంలో అనేక సినిమాలు చేశారు. ఇక, వ్యక్తిగతంగా చూసుకుంటే విఠలాచార్యకు జాతకంలో ప్రవేశం ఉంది. ఆయనకు మంచి జ్యోతిష్యులు అనే పేరు కూడా ఉంది. ఇక, ఆయన తన వెంట వచ్చిన జ్యోతిష్యుడిని అన్నగారికి పరిచయం చేశారు. అప్పటికి అన్నగారు పుత్ర శోకం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ సమయంలో జ్యోతిష్యుడు ఒక సంచలన విషయాన్ని చెప్పాడు.
“మీరు పరమ శివుడి వేషం ఇకపై వేయొద్దు. అది వేయడం వల్లే.. మీ అబ్బాయి హఠాన్మరణం చెందారు“ అని జ్యోతిష్యుడు అన్నగారి ముందు జాతక వివరాలను పెట్టారు. దీనిని అన్నగారు పెద్దగా నమ్మలేదు. కానీ, విఠలాచార్య పదే పదే అన్నగారికి జ్యోతిషం గురించిన వాస్తవాలను వివరించారు. దీంతో అన్నగారు విశ్వసించారు. ఇక, అప్పటి నుంచి అన్నగారు ఏ సినిమాలోనూ శివుడి వేషయం వేయలేదు. అంతేకాదు.. తర్వాత ఆయన తీసిన అనేక పౌరాణిక సినిమాల్లో శివుడి వేషానికి వేరే వారిని పురమాయించారే తప్ప.. అన్నగారు మాత్రం ధరించలేదు. ఇదిలావుంటే.. అన్నగారు శివుడి పాత్రంలో దక్షయజ్ఞం సినిమాలో మెప్పించడంతో అనేక ఆఫర్లు వచ్చాయి. అప్పట్లోనే కోట్ల రూపాయలు ఆఫర్లు చేశారు. అయినా.. అన్నగారు తన కుమారుడి సెంటిమెంటుతో వాటిని వదిలేసుకున్నారు. ఇదీ.. సంగతి!!