సినీ రంగంలో దివంగత ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. ఆయన చేసిన పాత్రలు, వేసిన పాత్రలు నభూతో నభవి ష్యతి! ఆయన సాధించిన రికార్డులు కూడా ఎవరూ అధిగమించలేరు. అనేక పాత్రలు వేసి మెప్పించారు. ఎవరూ ఊహించని అనేక పాత్రలు పోషించారు. పిచ్చిపుల్లయ్య నుంచి రాజు-పేదలో అత్యంత దీన స్థితిలో జీవించిన పాత్ర వరకుఅనేకభిన్నమైన పాత్రలు పోషించారు. అయితే.. ఎన్టీఆర్ పదే పదే మెచ్చుకు న్న సినిమా.. పలు మార్లు తన ఇంట్లో హోం థియేటర్ పెట్టుకుని మరీ చూసిన సినిమా మాత్రం ఒకటే ఉంది. అయితే.. అది ఎన్టీఆర్ సినిమా మాత్రం కాదు!
ఆశ్చర్యంగా అనిపించినా.. నిజం. ఎన్టీఆర్ తన జీవిత కాలంలో బాగా మెచ్చుకున్న సినిమా కన్నడ సూపర్ స్టార్.. రాజ్‌కుమార్ నటించిన భక్తకన్నప్ప! నిజం. 1954లో విడుదలైన రాజ్‌కుమార్ భక్త కన్నప్ప.. అప్పట్లోనే అన్ని భారతీయ భాషల్లోనూ డబ్బింగ్ అయింది. ఆ సంవత్సరాల్లో ఈ రేంజ్‌లో డబ్బింగ్ చేసిన సినిమా ఇది ఒక్కటే. ఈ సినిమాలో రాజ్‌కుమార్ యాక్షన్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంది. ఈ సినిమాను చూసిన అన్నగారు.. అప్పటి నుంచి రాజ్‌కుమార్‌తో స్నేహం కూడా చేయడం ప్రారంభించారు. ఈ సినిమాను ఆయన అనేక సందర్భాల్లో మెచ్చుకున్నారు కూడా..!
అంతేకాదు.. తదనంతర కాలంలో భక్త కన్నప్ప సినిమా ఆఫర్ వచ్చినా.. అన్నగారు వదులుకున్నారు. రాజ్‌కుమార్‌కు పోటీ కాకూడదనే ఉద్దేశంతో అన్నగారు ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. నిజానికి అన్నగారు వదులుకు న్న పాత్రల్లో భక్తకన్నప్ప.. అల్లూరి సీతారామరాజు వంటివి ఉండడం గమనార్హం. అంతేకాదు..తనకు నచ్చిన, మెచ్చిన సినిమాలు ఈ రెండింటినీ.. అనేక సందర్భాల్లో అన్నగారు ప్రస్తావించారు.
నిజానికి సినీ రంగంలో ఒకరిపై ఒకరికి అసూయ, పోటీ తత్వం ఉన్న కాలంలోనే అన్నగారు ఎంతో విశాల హృదయంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేటి తరానికి కూడా ఆదర్శమని అంటారు దర్శకులు. ఆ తర్వాత రాజ్‌కుమార్ – ఎన్టీఆర్ స్నేహం చనిపోయేంత వరకు చెక్కుచెదర్లేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అవ్వడంతో రాజ్‌కుమార్ ఎంతో సంతోషించారు. ఇక వీరి తర్వాత వీరి వారసుల మధ్య కూడా ఈ రెండు కుటుంబాల స్నేహం కొనసాగింది. రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు శివరాజ్‌కుమార్, ఎన్టీఆర్ తనయుడు బాలయ్య తండ్రుల్లాగానే బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగారు.
బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించారు. రాజ్‌కుమార్ వారసుల ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బాలయ్య వెళతారు. అలాగే వాళ్లు కూడా ఇక్కడకు వస్తారు. ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ కర్నాకట ప్రమోషన్లలో ఇటీవల మృతి చెందిన రాజ్‌కుమార్ వారసుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా పాల్గొన్నాడు. ఆయన చనిపోయినప్పుడు బాలయ్య వెళ్లి నివాళులు అర్పించడంతో పాటు ఎంత బాధపడ్డారో కూడా చూశాం.