అన్నగారు ఎన్టీఆర్ సినిమాలంటే.. ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆయన కేవలం సాంఘిక సినిమాలకే పరిమితం కాలేదు. పౌరాణిక, జానపద చిత్రల్లోనూ నటించారు. అయితే.. ఆయన నటించిన సినిమాల్లో డబ్బింగ్ చెప్పేప్పుడు.. తెలుగు ఉచ్ఛారణ విషయంలో చాలా ఖచ్చితత్వం పాటించేవారు. ఏపదాన్నయినా.. ప్రేక్షకులకు అర్ధమయ్యేలా పలకాలని తపించేవారు. పదాలను మింగేయడం.. అర్ధం కాకుండా.. పలకడం అంటే.. ఆయనకు మహా కోపం. దీంతో రచయితలు కూడాచాలా జాగ్రత్తలు తీసుకునేవారు.
దానవీర శూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులు, తెలుగు జనాల్లో ఎలా నానుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ పాపులర్ డైలాగులు ఇప్పటకీ ఓ ట్రెండ్ సెట్టరే. ముఖ్యంగా అన్నగారి సినిమాల్లో డైలాగులు రాసేప్పుడు.. రచయితలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకునే వారు. సినిమాలో సీన్‌కు.. డైలాగుకు మధ్య ఏమాత్రం తేడా వచ్చినా.. అన్నగారు ఊరుకునేవారు కాదు. దీంతో రచయితలు.. తాము రాసే డైలాగులను చాలా ఖచ్చితత్వంతో ఉండేలా చూసుకునేవారు.
సాంఘిక సినిమాల్లో డైలాగులు ఎలా ఉన్నా.. పౌరాణిక సినిమాల విషయంలో సంస్కృత పదాలకు, సమాసాలకు అన్నగారు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో ఆయన నటించిన పౌరాణిక చిత్రాలకు ఎక్కువగా తిరుపతి వెంకటకవులు రచయితలుగా ఉండేవారు. అయితే.. ఇంతగా డైలాగులమీద శ్రద్ధతీసుకునే అన్నగారికి.. `శ` అనే పదం పలకడం రాదంటే.. అతిశయోక్తి అనిపించకమానదు. కానీ, ఇది నిజం.
ఏ సందర్భంలో అయినా.. ఆయన `చూశారా` అని పలకాల్సి వచ్చినప్పుడు..`చూచారా!` అనే పలికేవారు. ఇది రచయితలకు ఇబ్బందిగా మారేది. వారేమో.. చూశారా.. అని రాసేవారట. కానీ, అన్నగారు మాత్రం చూచారా.. అనే పలికేవారట. దీంతో తర్వాత తర్వాత.. అసలు ఈ రెండు పదాల్లోనూ ఏది కరెక్ట్ అనే విషయం కూడా చర్చకు వచ్చిన సందర్భం ఉంది. అయితే.. అన్నగారు మాత్రం.. తను పలికిందే కరెక్ట్ అని అనేవారట! ఇదీ.. సంగతి!!