మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ పోటాపోటీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇది నిజంగా మెగాభిమానులకే కాదు. అందరికి అభినందనీయం.. యేడాదికి ఈ ఇద్దరు హీరోలు చెరో రెండు సినిమాల్లో నటించి.. అవి రిలీజ్ అయితే సగటు సినీ అభిమానికి కూడా అంతకుమించిన ఆనందం ఏంటుంది. ప్రతి మూడు నెలలకు ఈ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు నటించిన సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. వీరు వరుస పెట్టి సినిమాలను లైన్లో పెడుతుండడం ఆనందించదగ్గ విషయమే అయినా వీరు ఎంచుకుంటోన్న కథలు.. వరుసగా రీమేక్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుండడం మాత్రం వాళ్ల అభిమానులకే నచ్చడం లేదు.
చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 రీమేక్, గాడ్ ఫాదర్, భోళాశంకర్ రెండూ రీమేక్ సినిమాలే. పైగా ఇవి ఆ భాషల్లో వచ్చి చాలా రోజులు అయ్యింది. ఇక్కడ ఎంత బాగా తెరకెక్కించినా ఇప్పటికే యూట్యూబుల్లో చూసేసిన మెగాభిమానులే ఈ సినిమాలను లైట్ తీస్కొంటున్నారు. ఇది కాక చిరు ఇప్పుడు మరో రీమేక్‌కు రెడీ అవుతున్నారట. చిరుకు మళయాళ చిత్రం బ్రో డాడీ నచ్చడంతో దానిని రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారట.
ఇక పవన్ సంగతి వస్తే ఆయన గతేడాది చేసిన వకీల్‌సాబ్ పింక్‌కు రీమేక్. ఈ యేడాది చేసిన భీమ్లానాయక్ అయ్యప్పనుం కోషియమ్‌కు రీమేక్. త్వరలోనే వినోదయ సీతం కోలీవుడ్ రీమేక్ సినిమాకు సైతం ఓకే చెప్పేశారు. ఇలా చేసేవన్నీ అన్నదమ్ములు ఇద్దరూ రీమేక్ సినిమాలు చేసుకుంటూ పోతుంటే వీరి మార్కెట్ పెరగడం లేదు. ఇక ఈ రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకం. భీమ్లానాయక్ హిట్ అయినా.. అక్కడ పవన్ ఫ్యాన్స్ ఎంత హంగామా చేసిన 3 మిలియన్ డాలర్లు రాలేదు. ఇది రీమేక్ కావడమే అందుకు కారణం.
పైగా పవన్ కోలీవుడ్ రీమేక్‌తో పాటు మరో రీమేక్‌కు కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఆయా సినిమాల కథ, కథనాలు ముందే తెలిసిపోతున్నాయి. పోని అవన్నా కొత్తదనం ఉన్నవి.. బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యేవి కూడా కాదు. పోనీ భీమ్లానాయక్ ఏపీలో టిక్కెట్ రేట్ల విషయంలో బ్రేక్ ఈవెన్ కాలేదని అనుకున్నా.. ప్రభుత్వం ఎంతో కోపరేట్ చేసినా నైజాంలోని రికార్డులేమి బద్దలు కొట్టలేదు. ఆచార్య నైజాం రైట్స్‌ను రు. 42 కోట్లకు అమ్మారు. అదే రీమేక్ సినిమా అయితే అంత మార్కెట్ జరిగి ఉండేదే కాదు.
ఇక ఇద్దరు అన్నదమ్ములు కూడా పదే పదే రీమేక్ సినిమాలు చేస్తూ ఉండడంతో ప్రేక్షకులు కూడా బాగా బోర్ ఫీలవుతున్నారట. ఇక ఓవర్సీస్ జనాలు అయితే అసలు ఈ రీమేక్‌లు చూసేందుకు కూడా ఇష్టపడడం లేదని అంటున్నారు. అందుకే సినిమాలు ఎంత హిట్ అయినా వసూళ్లు బంపర్ రేంజ్‌లో రాకపోవడానికి ఇదే కారణం అని మెగాభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అదే బన్నీ పుష్ప ఒరిజినల్ స్టోరీతో చేస్తే దుమ్మురేపేసింది. మరి చిరు, పవన్ తలచుకుంటే ఆ రేంజ్‌లో దమ్మున్న కథలు ఎంచుకుని సినిమాలు చేయలేరా ? అన్న ప్రశ్న వస్తోంది.
పవన్, చిరు కంటే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వరుసగా రీమేక్‌లనే నమ్ముకుని హిట్లు కొట్టారు. అయితే వెంకీ మార్కెట్ గత పదేళ్లలో ఎంతగా దిగజారిపోయిందో తెలిసిందే. వరుసగా రీమేక్‌లు చేసి సేఫ్ జోన్ లో ఉండవచ్చేమో గాని.. మార్కెట్‌ను, క్రేజ్ చేజేతులా నాశనం చేసుకున్నట్టే అవుతుంది. మరి పవన్, చిరు ఇకపై అయినా స్ట్రైట్ సినిమాలతో అభిమానులను మెప్పిస్తారేమో ? చూడాలి.