తెలుగు సినిమా బడ్జెట్‌కు, మార్కెట్‌కు అవధులు లేకుండా పోతున్నాయి. ఒకప్పుడు రు. 100 కోట్ల బడ్జెట్ పెట్టాలంటేనే వామ్మో అనేవారు. ఇప్పుడు ఆ వంద కోట్లు కాస్తా రు. 200 కోట్లు నుంచి రు. 500 కోట్లు దాటేసి.. రు. 1000 కోట్ల దిశగా వెళ్లిపోతోంది. రు. 1000 కోట్లు పెడుతున్నా కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతోంది. త్రిబుల్ ఆర్ సినిమాకు అక్షరాలా రు. 500 కోట్లు ఖర్చు పెట్టారు. అసలు ఓ ప్రాంతీయ భాషా సినిమాగా చూస్తే అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా ? అని లెక్కలు వేసుకుంటే.. ఈ సినిమాను ఏపీ, తెలంగాణ వరకు రు. 191 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేశారు.
రు. 500 కోట్లతో తీసిన సినిమాకే రు. 191 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ మాత్రమే ఏపీ, తెలంగాణలో జరిగింది. ఇక రు. 1000 కోట్లతో సినిమా తీసినా రేపటి వేళ అంతకు మించి ఇక్కడ అయితే బిజినెస్ ఉండదు. ఇక అన్ని భాషల్లో శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకున్నా మరో రు. 225 – 250 కోట్లు వస్తుంది. మరో రు. 600 కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి ? కర్నాటక, తమిళనాడు, నార్త్ బెల్ట్, అటు ఓవర్సీస్ ఎన్ని లెక్కలు వేసుకున్నా కూడా రు. 600 కోట్లు అంటే పెద్ద జూదం లెక్కే.
సూపర్ డూపర్ అని చెప్పుకుంటోన్న త్రిబుల్ ఆరే ఇంకా రు. 150 కోట్ల నెట్ రాబడితే తప్పా బ్రేక్ ఈవెన్‌కు రాదు. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత మహేష్‌బాబు – రాజమౌళి సినిమా పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమాకు అక్షరాలా రు. 800 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథ, జానర్ ఏంటి అన్నది ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా ఈ సినిమా ఆఫ్రికా నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని చెప్పేశారు.
జేమ్స్‌బాండ్ స్టైల్లో సినిమా కథ నడుస్తుందని.. మహేష్‌బాబు క్యారెక్టర్ కూడా జేమ్స్‌బాండ్ లాగానే ఉంటుందని అయితే వార్తలు వస్తున్నాయి. జేమ్స్‌బాండ్ కథ అంటే అందుకు తగిన బడ్జెట్ ఉండాలి.. ఆఫ్రికాలోని కెన్యా, ఆఫ్రికా ఫారెస్టుల్లోనే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు షూట్ చేస్తారట. ఇక బడ్జెట్ రు. 800 కోట్లు అంటే.. అసలు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇది చివరి క్షణాల్లో పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమానే రు. 250 కోట్ల బడ్జెట్‌తో తీయాలని అనుకున్నాడు. అయితే అది చివరకు రు. 500 కోట్లు క్రాస్ అయ్యింది. రాజమౌళి నమ్మకం ఏంటంటే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టామినా రు. 2 వేల కోట్లు అని.. బాహుబలి 2 వసూళ్లే ఆ రేంజ్‌లో ఉండడంతో అదే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఇక మహేష్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించడంతో పాటు హాలీవుడ్లోనూ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. దేశంలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌లో హాలీవుడ్‌లో రిలీజ్ చేస్తే ఈ సినిమా వసూళ్లు మరో రేంజ్‌లో ఉంటాయన్నదే రాజమౌళి నమ్మకం.
ఇక దుర్గా ఆర్ట్ బ్యానర్‌పై డాక్టర్ కేఎల్. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. మహేష్ ప్రస్తుతం చేస్తోన్న సర్కారు వారి పాట.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసుకున్నాకే ఈ దసరాకు రాజమౌళి – మహేష్ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఏదేమైనా రాజమౌళి మరోసారి మహేష్ సినిమాతో సంచలనానికి రెడీ అవుతున్నాడు.