ఏ హీరోకి అయినా కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఏదో ఒక ఇబ్బంది రావటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది దర్శకుల కాంబినేషన్లో… హీరోల సినిమాలు షూటింగ్ ప్రారంభం అయ్యాక కూడా మధ్యలోనే ఆగిపోవడం సహజంగా జరుగుతుంది ముందుగా ఒక కథ అనుకుని.. తరువాత కథలో మార్పులు చేయటం లేదని… నిర్మాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని.. ఇలాంటి కారణాలతో పాటు అనేక కారణాలు సినిమాలు మధ్యలోనే ఆగిపోవడానికి కారణమవుతూ ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో 150కి పైగా సినిమాలలో నటించారు. చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. అవి ఎందుకు ఆగిపోయాయి ఆ సినిమాలు మిడిల్ డ్రాప్ అవ్వటానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోక వీరుడు సినిమా అనుకున్నారు. జానపద కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాలని ముందుగా అనుకున్నారు. అయితే తర్వాత కథలో మార్పులు చిరంజీవికి నచ్చకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత ఇదే వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మాణంలోనే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మరో సినిమా అనుకున్నారు. అప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా ఉన్నా ఊర్మిళ – టబులను చిరంజీవి పక్కన తీసుకున్నారు.
వీరిద్దరిపై చెరో సాంగ్‌లు కూడా షూట్ చేశారు. ఆ తర్వాత భారీ ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను కూడా చిరంజీవిపై దర్శకుడు చిత్రీకరించారు. అలాగే కర్ణాటక అడవుల నేపథ్యంలో కూడా కొన్ని సీన్లు తీశారు. ఈ సినిమా కోసం అశ్వినీ దత్ భారీ బడ్జెట్ కూడా కేటాయించారు. వర్మ వ్యవహార శైలీ చిరుకు నచ్చకపోవడంతో సడెన్‌గా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ఇచ్చిన డేట్లతోనే అశ్వనీదత్ చిరుతో చూడాలని ఉంది సినిమా తీసి హిట్ కొట్టారు.
ఇక మెగాస్టార్‌తో మాస్టర్ – రజనీకాంత్ భాషా లాంటి సూపర్ హిట్లు కొట్టి ఫామ్‌లో ఉన్న సీనియర్ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అబూబాగ్దాద్ గజదొంగ అనే పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక మధ్యలో ఆపేశారు. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని చిరంజీవి సైతం ఎంతో పట్టుదలతో ఉన్నారు. అయితే అనుకోని కారణాలవల్ల సినిమా మధ్యలో ఆపాల్సి వచ్చింది.
ఇక చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్ లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే అక్కడితోనే ఆ సినిమా ఆగిపోయింది. అప్పట్లో వరుస విజయాలతో… ఫ్యామిలీ సినిమాలతో దూసుకుపోతున్న ఎస్వీ. కృష్ణారెడ్డి – చిరంజీవి కాంబినేషన్ లో కూడా ఓ సినిమా అనుకున్నారు. పూజా కార్యక్రమాలు జరిగాయి. అయినా ఇది పట్టాలెక్కలేదు. ఇక మనసంతా నువ్వే తర్వాత ఆ సినిమా దర్శకుడు వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా అనుకున్నారు. అది కూడా పట్టాలు ఎక్కలేదు. ఇక చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా అనుకున్నారు. దాదాపు ప్రకటన రావడమే ఆలస్యం అనుకున్నారు. పూరి చెప్పిన సెకండాఫ్ చిరుకు నచ్చలేదు.. అది కూడా అక్కడితో ఆగిపోయింది. అలా చిరంజీవి నటించిన ఈ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.