సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. 1999లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబుకు రెండో సినిమా యువరాజు యావరేజ్ మార్కులు వేసింది. మూడో సినిమా మహేష్ బాబు పద్మాలయా బ్యానర్లో నటించాడు. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన వంశీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
దీంతో ఎలాగైనా నాలుగో సినిమాతో హిట్ కొట్టాలని డిసైడ్ అయిన మహేష్ బాబు.. కృష్ణ వంశీ చెప్పిన కథ విని ఆ సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పట్లో మహేష్‌బాబుకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. మహేష్‌కు యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే… లవర్ బాయ్ ఇమేజ్ అనేది స్టార్ హీరోల కంటే తక్కువ కాదు. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో నటించవద్దని మహేష్‌కు చెప్పేశారట. ఈ సినిమా కథ తనకు ఎంతమాత్రం నచ్చలేదని చెప్పినా మహేష్ బాబు మాత్రం పట్టుబట్టి మురారి సినిమా చేశారు.
చివరకు దర్శకుడు కృష్ణవంశీకి .. నిర్మాత రామలింగేశ్వర రావు కు మధ్య కూడా సినిమా రన్ టైం విషయంలో గ్యాప్ వచ్చింది. సినిమా నిడివి మూడు గంటలకు పైగా ఉందని.. ట్రిమ్ చేయాలని నిర్మాతలు పట్టుబట్టినా కృష్ణవంశీ మాత్రం వినలేదు. ఇలా ఎన్నో అడ్డంకులు దాటుకుని రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలిరోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో ఫ్యాన్స్ ఎలివేషన్స్ తో పాటు మాస్ మెచ్చే ఎలిమెంట్స్ కూడా లేవని ఫ్యాన్స్ కూడా నిరాశ పడ్డారు.
అయితే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మురారి నచ్చేసింది. వారం రోజుల వరకు థియేటర్లలో జనాలు లేరు. అక్కడ నుంచి క్రమక్రమంగా ప్రేక్షకులకు నచ్చటం ప్రారంభించింది. చాలా చోట్ల 100 రోజులు, 175తో పాటు హైదరాబాద్‌లో ఏకంగా 225 రోజులు ఆడి మహేష్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముందు ఈ సినిమా చేయవద్దని మహేష్‌కు చెప్పిన కృష్ణ సైతం మహేష్ నటన చూసి ఫిదా అయిపోయారు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే నటించింది. అలనాటి నటి లక్ష్మి మహేష్‌కు తల్లిగా నటించగా, మణిశర్మ స్వరాలు సమకూర్చారు.