ఒకప్పుడు హీరోలను చూసి సినిమాలకు వెళ్లే వాళ్లు. అయితే ఆ తరంలో కె. రాఘవేంద్రరావు లాంటి ఒకరిద్దరు దర్శకులు మాత్రమే తమకంటూ ఓ బ్రాండ్ ఏర్పరుచుకున్నారు. విశ్వనాథ్, బాపు లాంటి వారు గొప్ప దర్శకులే అయినా కమర్షియల్ ఫార్మాట్ పరంగా చూసినప్పుడు వారి సినిమాలకు కాస్త క్రేజ్ తక్కువుగా ఉండేది. వీరి సినిమాలకు సపరేట్ అభిమానులు ఉండేవారు. ఆ తర్వాత బి.గోపాల్‌కు హీరోలతో సంబంధం లేని ఇమేజ్ వచ్చింది. ఇక ఈ తరంలో సీన్ మారిపోయింది. హీరో ఎవరు ? అన్న దాంతో సంబంధం లేకుండా దర్శకుడు రాజమౌళీయా ? సుకుమారా ? త్రివిక్రమా ? అని చూసుకుని కూడా జనాలు సినిమాలకు వెళ్లిపోతున్నారు. పైన చెప్పుకున్న దర్శకులు హీరోలతో సంబంధం లేకుండా సొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.
ఈ దర్శకులకు టాప్ లేచిపోయే హీరో ఇమేజ్ కూడా తోడైతే ఇంకేముంది.. బాక్సాఫీస్ హీటెక్కిపోవాల్సిందే.! ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ సినిమా మానియా మార్మోగుతోంది అంటే అందుకు కారణం కేవలం రాజమౌళీ బ్రాండే. ఈ సినిమాకు తెలుగు గడ్డపై భయంకరమైన క్రేజ్ రావడంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్ర కూడా కాదనలేం. అయితే టాలీవుడ్ మార్కెట్‌కు భయట జరుగుతోన్న మార్కెట్, క్రేజ్ మొత్తం రాజమౌళీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు సినిమా ఎలా ఉంటుందా ? అని చాలా మంది కలల్లోనే ఊహించేసుకుంటున్నారు.
మామూలుగానే ఒక డైరెక్టర్ ఒకటి రెండు హిట్లు ఇచ్చాడంటే ప్రేక్షకులు ఆ దర్శకుడి సినిమా వచ్చిందంటే చాలు క్యూ కట్టేస్తారు. ఒకటి కాదు రెండు కాదు 20 ఏళ్లుగా ఒక్క ప్లాప్ లేకుండా సినిమాలు తీయడం అంటే అది రాజమౌళీకే చెల్లింది. భారతదేశ సినిమా చరిత్రలోనే ఇన్నేళ్ల పాటు అసలు ప్లాప్ లేకుండా సూపర్ హిట్లు ఇచ్చిన మరో దర్శకుడు లేనే లేడు. బాహుబలి తర్వాత రాజమౌళి పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నాడు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజమౌళితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు మాత్రమే కాదు.. పెద్ద బడా నిర్మాతలు సైతం క్యూలో ఉన్నారు.
అలాంటి రాజమౌళి కెరీర్ స్టార్టింగ్‌లో ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయిందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి హిట్ సినిమాతోనే రాజమౌళి కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళీయే అయినా.. కూడా దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం తన గురువు రాఘవేంద్రరావుకే ఇచ్చేశాడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా ఓ మైథలాజికల్ డ్రామా తీయాలని రాజమౌళి అనుకున్నాడు. అయితే ఆ సినిమా ఆగిపోయింది.
చివరకు తన గురువు రాఘవేంద్రరావు తనయుడు కే. సూర్యప్రకాష్‌ను హీరోగా పెట్టి ఓ లవ్ స్టోరీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకున్నాడు. అయితే భారీ బడ్జెట్ కావడంతో ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇందుకు కారణం సూర్యప్రకాష్ నటించిన మొదటి సినిమా నీతో అట్టర్ ప్లాప్ అవ్వడం కూడా ఓ కారణమే. అలా రెండు సినిమాలు వదులుకున్నాక చివరకు తన మొదటి సినిమా హీరో ఎన్టీఆర్‌నే పెట్టి ఈ సారి కేరళ బ్యాక్‌డ్రాప్‌తో సింహాద్రి లాంటి పవర్ ఫుల్ ఫ్యాక్షన్ సినిమా తీశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రాజమౌళి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.