నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన చిత్రం.. దేవదాస్. సుదీర్ఘ సినీ చరిత్రలో ఈ సినిమా సాధించిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. విఫల ప్రేమికుడిగానే కాకుండా.. అహంకారిగా.. పక్కా తాగుబోతుగా.. దేవదాస్‌పాత్రలో నాగేశ్వరరావు లీనమైన ఈసినిమా.. తెలుగులో 365 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని.. అనేక రికార్డులు సాధించింది. భారతదేశ వ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకు ఎన్నో భాషల్లో 12కు పైగా దేవదాసులు వచ్చాయి. బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్ – ఐశ్వర్య జంటగా కూడా ఓ దేవదాస్ చేశారు.
ఎన్ని దేవదాసులు వచ్చినా కూడా భారతదేశ సినీ జనాలు మాత్రం దేవదాస్‌గా ఏఎన్నార్‌ను మాత్రమే ఊహించుకున్నారు అంటే దేవదాస్ పాత్రలో ఆయన ఎంతలా లీనమైపోయారో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ సినిమా వెనుక.. ఒక కథ చాలా రోజులు తెలుగు ఇండస్ట్రీలో నడిచింది. దేవదాస్ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య. నిర్మాత డీఎల్ నారాయణ. ఈ సినిమాను తెలుగు , తమిళంలో ఒకే సారి తీశారు. అయితే.. వేదాంతం రాఘవయ్యకు.. యువ ఎన్టీఆర్ అంటే.. అత్యంత ఇష్టం. పైగా.. ఏ వేషం వేసినా.. ఇట్టే ఇమిడిపోతారనే పేరు కూడా అన్నగారికి ఉంది.
దీంతో తొలుత దేవదాసు చిత్రం గురించి చర్చించినప్పుడు.. ఎన్టీఆర్‌ను అనుకున్నారట. ఇక, సావిత్రి వేషధారి కూడా సావిత్రి కాదు. ఆ పాత్రకు తొలుత భానుమతిని ఎంపిక చేయాలని అనుకున్నారు. ఎందుకంటే.. దేవదాస్ సినిమాలో హీరో ఎంత పొగరుగా ఉంటాడో.. హీరోయిన్ కూడా అంతే! సో.. ఈ పాత్రకు భానుమతి అయితే.. బెస్ట్ సూటబుల్ అని రాఘవయ్య అనునుకున్నారట. అంతే.దీనిని బట్టి.. సీన్లు రాసుకుంటు పోయారు. ఎన్టీఆర్‌ను వాహినీ స్టూడియోకు పిలిచి.. తొలి షూట్ కూడా తీశారు.
అయితే.. కథలో చేసిన మార్పులు తర్వాత కాలంలో.. ఎన్టీఆర్‌కు నచ్చలేదట. కేవలం హీరోను తాగుబోతుగా చూపించడాన్ని ఆయన సహించలేక సినిమా నుంచి విరమించుకున్నారట. ఇక, భానుమతి ఫుల్ బిజీగా ఉండడంతో ఆమె కూడా సినిమాలో యాక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే అన్నగారు ఈ సినిమాను వదులుకున్నారని అప్పటి ఇండస్ట్రీ జనాలు చర్చించుకునే వారు. చివరకు ఆ కథ అలా ఏఎన్నార్ వద్దకు వెళ్లడం ఆయన ఆ సినిమా చేసి చరిత్రలో ఎప్పటకీ నిలిచిపోయే హిట్ కొట్టడం జరిగిపోయాయి.